డిగ్రీలో లక్ష సీట్లకు కోత!

5 Sep, 2017 02:08 IST|Sakshi
డిగ్రీలో లక్ష సీట్లకు కోత!

భారీగా మిగిలిపోతుండటంతో ఉన్నత విద్యా మండలి నిర్ణయం
వచ్చే విద్యా సంవత్సరం నాటికి అమల్లోకి..!
25 శాతంలోపు ప్రవేశాలున్న కాలేజీలకు అనుమతి రద్దు

సాక్షి, హైదరాబాద్‌
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఏటేటా ప్రవేశాల సంఖ్య తగ్గిపోతుండటంతో సీట్లకు కోత పెట్టాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. ఏకంగా లక్ష వరకు సీట్లను రద్దు చేయాలని... వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 1,092 డిగ్రీ కాలేజీల్లో 4.10 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. ఏటా అందులో సగం సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. ఈసారి సగం సీట్లు కూడా భర్తీకాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మూడో దశ కౌన్సెలింగ్‌ ముగిసేనాటికి 1,93,198 సీట్లు భర్తీ కాగా.. నాలుగో దశ కౌన్సెలింగ్‌లో మరో 8,789 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. వారందరూ కాలేజీల్లో చేరినా భర్తీ అయ్యే సీట్లు 2.01 లక్షలకు మించని పరిస్థితి నెలకొంది.

25 శాతం సీట్లు నిండకుంటే..
డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య తగ్గిపోతుండడంతో.. ఉన్నత విద్యా మండలి ఇప్పటికే కొత్త కాలేజీలకు అనుమతులను నిలిపివేసింది. తాజాగా సీట్ల కోతపై దృష్టి సారించింది. కనీసం 25 శాతమైనా సీట్లు భర్తీ కాని కాలేజీలను కొనసాగించడం కష్టమని, అందువల్ల అలాంటి కాలేజీలను మూసివేయాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. వాటిల్లో చేరిన విద్యార్థులను ఇతర కాలేజీల్లో చేర్పించాలని యూనివర్సిటీలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇలా 50కి పైగా కాలేజీల్లో ప్రవేశాలు రద్దు కానున్నాయి. ఇవేగాకుండా వచ్చే ఏడాది ప్రవేశాల సమయం నాటికి మరిన్ని సీట్లను రద్దు చేయాలని యోచిస్తోంది. అందులో భాగంగా డిగ్రీ కాలేజీల్లోనూ నాణ్యతా ప్రమాణాలు, ఫ్యాకల్టీ, ఇతర సదుపాయాలకు సంబంధించిన అంశాలపై తనిఖీలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించినట్లు సమాచారం. తద్వారా లోపాలున్న కాలేజీలను మూసివేయాలని.. మొత్తంగా వచ్చే ఏడాది నాటికి లక్ష సీట్లకు కోత పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

భారీగా తగ్గిపోతున్న ప్రవేశాలు
డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు ఏటేటా తగ్గిపోతున్నాయి. గత నాలుగేళ్లుగా అయితే ఏకంగా 20 వేల చొప్పున విద్యార్థులు తగ్గిపోయారు. 2014–15లో 2.65 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 2.01 లక్షలకు పడిపోయింది. మరోవైపు ఏటా డిగ్రీ కాలేజీలు, సీట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2014–15లో 3.65 లక్షల సీట్లు ఉండగా.. ప్రస్తుతం 4.10 లక్షలకు పెరిగాయి. కానీ కాలేజీల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. కాలేజీల యాజమాన్యాలు డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో సీట్లను పెంచుకోవడం, ఇతర కోర్సుల సీట్లను కన్వర్షన్‌ చేసుకోవడం వంటివి చేస్తున్నా.. సీట్ల భర్తీ తక్కువే ఉంటోంది.

>
మరిన్ని వార్తలు