దోబూచులాడుతున్న నైరుతి..

15 Jun, 2016 01:32 IST|Sakshi
దోబూచులాడుతున్న నైరుతి..

రాష్ట్రంలోకి రావడానికి  మరో నాలుగైదు రోజులు

సాక్షి, హైదరాబాద్: రుతుపవనాలు రాష్ట్రంలోకి రావడానికి దోబూచులాడుతున్నాయి. వారం కిందట కేరళను తాకిన ‘నైరుతి’ రాష్ట్రంలోకి రావడానికి ఆలస్యం చేస్తోంది. వాస్తవానికి బుధవారం నాటికల్లా రాష్ట్రంలోకి వస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని తాజాగా ప్రకటించింది. వాతావరణంలో గంట గంటకూ వేగంగా మార్పులు చోటు చేసుకుంటాయని, దాంతో రుతు పవనాలు ఒక్కోసారి వేగంగా ముందుకు కదులుతాయని, ఒక్కోసారి స్థిరంగా ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడితే రుతు పవనాలు వేగంగా ప్రవేశిస్తాయని చెబుతున్నారు. గతేడాది తెలంగాణలోకి రుతు పవనాలు జూన్ 13వ తేదీనే ప్రవేశించాయి. ఈ ఏడాది 15న వస్తాయని అనుకున్నా రాలేదు. ఎంత ఆలస్యమైనా జులై నుంచి మాత్రం పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.

 
పినపాక, మణుగూరుల్లో భారీ వర్షం..
రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో ఖమ్మం జిల్లా పినపాకలో 7, మణుగూరులో 6 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలోనే అనేకచోట్ల, వరంగల్ జిల్లాలో కొన్నిచోట్ల వర్షాలు కురిశాయి. మంగళవారం రామగుండంలో అత్యధికంగా 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 40.8, హన్మకొండ, నిజామాబాద్‌ల్లో 39.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డయింది. ఖమ్మం లో 38.6, హైదరాబాద్‌లో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

 

మరిన్ని వార్తలు