ఆసరా ఆలస్యం!

24 Feb, 2016 02:05 IST|Sakshi
ఆసరా ఆలస్యం!

వృద్ధులు, వికలాంగులు, బీడీ కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఆసరా పింఛన్లు ఆలస్యమవుతున్నాయి.
నెలాఖరు కావొస్తున్నా ఇప్పటి వరకు వారి చేతికి డబ్బులు అందలేదు.
దీంతో పింఛన్‌పైనే ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ఆందోళన చెందుతున్నారు.
పింఛన్ ఎప్పుడొస్తుందా అని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

 
* ప్రతినెలా ఇదే తంతు
* నేటికీ అందని పింఛన్
* 5.41 లక్షల మంది ఎదురుచూపు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పింఛన్ మొత్తాన్ని పెంచిన విషయం తెలిసిందే. గతంలో వృద్ధులు, వితంతవులకు రూ.200, వికలాంగులకు రూ.500 చొప్పున పింఛన్ ఇచ్చేవారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక వృద్ధులు, వితంతవులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 చొప్పున చెల్లిస్తున్నారు.

వీరితోపాటు టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికులకూ రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తోంది. అయితే గతంలో పింఛన్లు ప్రతినెలా ఒకటో తారీఖునే వచ్చేవి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రతినెలా ఒకటో తారీఖున పింఛన్ డబ్బు తీసుకునేవారు. కానీ గత కొద్దినెలలుగా పరిస్థితి భిన్నంగా మారింది. ప్రతినెలా రూ.వెయ్యి పింఛన్ వస్తుందనే సంతోషం వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికుల్లో కనిపిస్తున్నా... ఆ సొమ్ము ఏ రోజు ఇస్తారో తెలియక సతమతమవుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి నెలాఖరు దాకా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పింఛన్ కోసం వాకబు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
 
జిల్లాలో 5.44 లక్షల మంది
జిల్లావ్యాప్తంగా ప్రతినెలా 5,44,215 మందికి పింఛన్లు మంజూరవుతున్నాయి. వాటిలో 1,92,563 మంది వృద్ధులు, 1,31,226 మంది వితంతవులు, 67,804 మంది వికలాంగులు, 9074 మంది చేనేత కార్మికులు, 11,615 మంది గీత కార్మికులు, 1,29,681 మంది బీడీ కార్మికులు, 3,220 మంది హెచ్‌ఐవీ బాధితులున్నారు. వీరికి ప్రతినెలా రూ.59.09 కోట్లు చెల్లిస్తోంది. వీరుగాక అభయహస్తం కింద 19,823 మంది మహిళలకు ప్రతినెలా రూ.4.08 కోట్లు చెల్లిస్తోంది.

ఆయా మొత్తాన్ని ప్రభుత్వం గ్రామాల్లో ఎంపీడీవోలకు పంపుతోంది. ప్రతినెలా 15 వరకు ఆ మొత్తాన్ని ఎంపీడీవోలకు జమ చేస్తుండగా, అక్కడి నుంచి గ్రామ కార్యదర్శులకు వారి ద్వారా పింఛన్ దారులకు నెలాఖరులోపు చెల్లిస్తున్నారు. సుమారు 3,66,280 మంది పింఛన్‌దారులు గ్రామ కార్యాదర్శుల వద్దకు వెళ్లి పింఛన్ సొమ్ము తీసుకుంటున్నారు. మిగిలిన వారి విషయానికొస్తే... జిల్లాలో 182 గ్రామ పంచాయతీల్లో వీఎల్‌ఈ/సీబీఎస్‌ల ద్వారా నేరుగా 82,422 మంది పింఛన్‌దారుల ఖాతాల్లో  డబ్బు జమ చేస్తున్నారు.

పట్టణాల విషయానికొస్తే.. జిల్లాలోని 93,261 మంది పింఛన్‌దారులకు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే పింఛన్ సొమ్ము జమ అవుతోంది. అయితే పింఛన్ సొమ్ము మాత్రం ఏ రోజు జమ అవుతుందో తెలియక వృద్ధులు, వితంతవులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛన్ సొమ్ము అందనేలేదు. అధికారులను అడిగితే ఎప్పుడు వస్తుందో కూడా చెప్పడం లేదని పలువురు వాపోతున్నారు. ఇదే విషయంపై అధికారులను వాకబు చేయగా ప్రభుత్వం నుంచి బుధవారమే డబ్బులు బ్యాంకుల్లో జమ అయ్యాయని, నెలాఖరులోపు పింఛన్ అందజేస్తారని పేర్కొనడం గమనార్హం.
 
ఆఫీస్ చుట్టూ తిరుగుడే
పింఛన్‌కోసం రోజు గ్రామపంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. ఎప్పుడు పైసలిత్తరో తెలుస్తలేదు. పైసలస్తే సమ్మక్కజాతరకు పోదామనుకున్నా... పైసల కోసం పట్టించుకునేటోల్లే లేరు.
- అగ్గి భూదేవి వృద్ధురాలు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా