రైల్వే ప్రాజెక్టులపై నీలినీడలు

26 Feb, 2019 06:44 IST|Sakshi

ఏళ్లుగా పెండింగ్‌ జాబితాకే పరిమితం   

నిధుల కొరత, సమన్వయలేమి  

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైల్వే ప్రాజెక్టులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఏళ్లుగా ఎలాంటి పురోగతి లేకుండా పెండింగ్‌ జాబితాకే పరిమితమవుతున్న ప్రాజెక్టులపై అప్పుడప్పుడు అధికారుల స్థాయిలో సంప్రదింపులు, చర్చలు మినహా ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుల్లో సింహభాగం రాష్ట్రం అందజేసే నిధులు, వనరులపైనే  ఆధారపడి ఉన్నాయి. కానీ కేటాయింపుల్లో సమన్వయలేమి కనిపిస్తోంది. ఇరువర్గాల మధ్య చర్చలు జరిగినప్పటికీ అవి అధికారుల స్థాయికే పరిమితం కావడంతో నిధులు కేటాయింపులో ప్రభుత్వాన్ని  కదిలించలేకపోతున్నాయి. దీంతో రైల్వే ప్రాజెక్టులపై చాలా కాలంగా నిర్లక్ష్యం కొనసాగుతోంది. ప్రజల మౌలిక అవసరాలను, రవాణా సదుపాయాలను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన ప్రాజెక్టులు సైతం అతీగతీ లేకుండా పోతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రాజెక్టుల ప్రాధాన్యతపై తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. ఎదురుచూపులే మిగులుతున్నాయి. 

టర్మినల్‌ విస్తరణకు భూమి కొరత...
నగరంలోని మూడు ప్రధాన రైల్వేస్టేషన్‌లలో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన చర్లపల్లి రైల్వే టర్మినల్‌కు భూమి కొరత పెద్ద సమస్యగా మారింది. పది ప్లాట్‌ఫామ్‌లతో చర్లపల్లి విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం రైల్వేకు అందుబాటులో ఉన్న భూమికి మరో 100 ఎకరాల వరకు  కేటాయించేందుకు మూడేళ్ల క్రితం ప్రభుత్వం అంగీకరించింది. ఇక్కడ టర్మినల్‌ నిర్మించడంతో విశ్వనగర నిర్మాణానికి అనుకూలమైన రవాణా సదుపాయాలను విస్తరించేందుకు అవకాశం ఉంటుందని భావించారు. నగర శివారు ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు చర్లపల్లి నుంచి ఔటర్‌రింగ్‌ రోడ్డు మీదుగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. మరోవైపు ట్రాఫిక్‌ రద్దీ కారణంగా రైలు అందుకోలేకపోవడం అనే ఇబ్బందులు ఉండవు. సుమారు రూ.85 కోట్ల అంచనాలతో చేపట్టిన ఈ  ప్రాజెక్టుకు రైల్వేశాఖ ఇప్పటి వరకు రూ.15 కోట్ల వరకు నిధులను అందజేసింది. కానీ ఇంకా పనులు మొదలు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగినంత భూమి లభిస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. చర్లపల్లి వినియోగంలోకి వస్తే ప్రతిరోజు 200 రైళ్లు, సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్‌పై 50 శాతం ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణికులకు కూడా మెరుగైన, నాణ్యమైన సదుపాయాలు లభిస్తాయి.

రైళ్లు ఒక్కటే పరిష్కారం...
ఇక ఎంఎంటీఎస్‌ రెండో దశ ‘ఇంకా ఎంతెంత దూరం...’ అన్నట్లుగా మారింది. అనేక రకాల అడ్డంకులను అధిగమించి ఈ ప్రాజెక్టు ఒక కొలిక్కి వచ్చినప్పటికీ రైళ్లు మాత్రం పట్టాలెక్కలేకపోతున్నాయి. 2013లో చేపట్టిన  రెండో దశకు నిధుల కొరత పెద్ద సవాల్‌గా మారింది. ఆ తరువాత భూమి లభ్యత మరో సవాల్‌గా నిలిచింది. ఈ రెండింటిని అధిగమించి క్రమంగా పనుల్లో వేగం పెంచారు. ఇప్పటి వరకు రెండు మార్గాలు మాత్రం పూర్తయ్యాయి. మరో 4 లైన్‌లలో నిర్మాణ దశలో ఉన్నాయి. పనులు పూర్తయిన సికింద్రాబాద్‌–బొల్లారం, పటాన్‌చెరు–తెల్లాపూర్‌లలో ఎంఎంటీఎస్‌ రైళ్లను నడిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ మళ్లీ నిధుల కొరత  ముందుకొచ్చింది. రూ.850 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం మూడొంతుల నిధులు ఇవ్వాల్సి ఉంది. రెండో దశ కోసం కనీసం 9 రైళ్లు అవసరమని గుర్తించారు. ఇందుకోసం రూ.250 కోట్ల (ప్రాజెక్టు  వ్యయంలో భాగంగానే) మేరకు  ప్రతిపాదించారు. జనరల్‌ మేనేజర్‌ స్థాయిలో గతంలోనే ఈ అంశంపై  సంప్రదింపులు జరిగాయి. కానీ పురోగతి లేదు. లైన్‌లు ఉన్నా రైళ్లు పట్టాలెక్కని పరిస్థితి.  

పురోగతి లేని యాదాద్రి...  
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తుది దశకు చేరింది. త్వరలోనే అత్యంత వైభవోపేతంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా, ఎంతో అందమైన ఆధ్మాత్మికమైన ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన యాదాద్రికి రోడ్డు రవాణా మార్గంతో పాటు రైల్వే సదుపాయం కూడా ఉండాలని ప్రభుత్వమే మూడేళ్ల క్రితం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన రైల్వేబోర్డు  అప్పటికప్పుడు సర్వేలు పూర్తి చేసి ప్రాజెక్టు అంచనాలను రూపొందించింది. ఘట్కేసర్‌ నుంచి రాయగిరి వరకు రెండో దశను పొడిగించేందుకు రూ.330 కోట్ల వరకు అంచనాలు వేశారు. భూమి, ఇతర వనరులతో పాటు, ప్రాజెక్టు వ్యయంలో 59 శాతం రాష్ట్రం ఇవ్వాల్సి ఉంది. మిగతా 41 శాతాన్ని రైల్వే శాఖ భరిస్తుంది. యాదాద్రి కోసం కేంద్రం ఇప్పటి వరకు రూ.50 కోట్ల మేర కేటాయించింది. ఇటీవల టెండర్లను రద్దు చేశారు. మరోసారి  ఆహ్వానించాల్సి ఉంది. కానీ అది రాష్ట్ర ప్రభుత్వ స్పందనపైనే ఆధారపడి ఉంటుందని దక్షిణమధ్య రైల్వే  ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఏప్రిల్‌లో ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్‌లోనైనా రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తే బాగుంటుందని  పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు