రీ డిజైనింగ్‌తోనే ప్రాజెక్టులు ఆలస్యం

4 Jul, 2017 01:56 IST|Sakshi
రీ డిజైనింగ్‌తోనే ప్రాజెక్టులు ఆలస్యం

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం
కల్వకుర్తి: ప్రభుత్వాలు ప్రాజెక్టులను అనేకసార్లు రీ డిజైనింగ్‌ చేయడంతోనే పనులు ఆలస్యం అవుతున్నాయని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పేర్కొన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో జేఏసీ, అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఆర్టీవో కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం చేసేముందు ముంపునకు గురికాకుండా డిజైనింగ్‌ చేయాలన్నారు.

గతంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసిన అనంతరం కొత్త ప్రాజెక్టులను నిర్మించాలని కోరారు. కృష్ణా జలాలు మహబూబ్‌నగర్, నల్లగొండ ప్రాంతాలకు చెందాలన్నారు. పాలమూరుకు పూర్తి స్థాయిలో నీరు అందించిన తరువాతే ఇతర ప్రాంతాలకు తరలించాలన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని నాలుగో లిప్టును పూర్తి చేసి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందించవచ్చని కోదండరాం పేర్కొన్నారు. నాల్గవ లిప్టు పూర్తి చేస్తే అసలు పాలమూరు ప్రాజెక్టు అవసరం లేదన్నారు.

మరిన్ని వార్తలు