పెద్దాస్పత్రిని సందర్శించిన ఢిల్లీ బృందం

3 Jul, 2018 10:42 IST|Sakshi
కంగారు మదర్‌ కేర్‌ సెంటర్‌ను పరిశీలిస్తున్న అధికారులు 

ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్స్‌కి చెందిన ఢిల్లీ బృందం సోమవారం సందర్శించింది. డాక్టర్‌ టన్ను నాతోగి, డాక్టర్‌ వినోద్, సందీప్‌షా ఆధ్వర్యంలో బృందం సభ్యులు ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. తొలుత మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి.. మెటర్నిటీ, ఎస్‌ఎన్‌సీయూ, ఎన్‌ఆర్‌సీ, లేబర్‌ రూం, ఓపీ సేవలను పరిశీలించారు.

అనంతరం పాత ఆస్పత్రిలోని క్యాజువాలిటీ, ఓపీలను పరిశీలించి.. పనితీరును పూర్తిస్థాయిలో తెలుసుకున్నారు. ఆస్పత్రి నిర్వహణ, రోగులకు అందుతున్న సేవల పట్ల బృందం సభ్యులు సంతృప్తిని వ్యక్తం చేసినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. బృందం సభ్యులు 18 విభాగాలను పరిశీలించాల్సి ఉండగా.. తొలిరోజు 9 విభాగాల పరిశీలన పూర్తయింది. రెండు బృందాలు రాగా.. ఒక బృందం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని, మరో బృందం భద్రాచలం ఏరియా ఆస్పత్రిని సందర్శించింది.

మూడు రోజుల పరిశీలన అనంతరం నివేదిక తయారు చేసి నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్స్‌కు నివేదిస్తారు. పరిశీలనలో రాష్ట్ర బృందం సభ్యులు, ఉమ్మడి జిల్లాల నోడల్‌ ఆఫీసర్‌ అశోక్‌కుమార్, ఎన్‌హెచ్‌ఎం స్టేట్‌ కోఆర్డినేటర్‌ నిరంజన్, రాంబాబునాయక్, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మదన్‌సింగ్, ఆర్‌ఎంఓ శోభాదేవి, బి.వెంకటేశ్వర్లు, బి.శ్రీనివాసరావు, కృప ఉషశ్రీ, బాలు, నాగేశ్వరరావు, రామ్మూర్తి, ఆర్‌వీఎస్‌ సాగర్, నయీమ్, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆస్పత్రిలో ఎన్‌క్వాస్‌ బృందం పరిశీలన 

భద్రాచలంఅర్బన్‌: పట్టణ శాంతినగర్‌ కాలనీలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సోమవారం ఉదయం జాతీయ నాణ్యత ప్రమాణాలును ధృవీకరించే (ఎన్‌క్వాస్‌) అధికారుల బృందం పర్యటించింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ బృందంలో మనోరంజన్‌ మహాపాత్ర, ఎంఎం.లీసమ్మ, కొచ్చా నవీన్‌ తదితరులు సభ్యులుగా ఉన్నారు.

మూడు రోజలు పాటు ఆస్పత్రిలోని అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే పారిశుద్ధ్య విషయంలో, రోగులకు వైద్య సేవలు అందించడంలో మంచి పేరు సొంతం చేసుకున్న ఈ ఆసుపత్రికి ఎన్‌క్వాస్‌ గుర్తింపు లభిస్తే దేశంలోనే ఏజెన్సీ ప్రాంతంలో గుర్తింపు పొందిన ఆసుపత్రిగా పేరు అందుకుంటుంది. ఎన్‌క్వాస్‌ గుర్తింపు వల్ల వచ్చే ప్రోత్సాహంతో ఏజెన్సీ ప్రాంతంలోని ఈ ఆసుపత్రిలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందకు వీలు కలుగుతుంది. ఈ బృందంతో పాటు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఎంవీ కోటిరెడ్డి, ఆర్‌ఎంఓ చావా యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు