ఆ రెండూ దొరకట్లేదు..

5 Apr, 2020 04:19 IST|Sakshi

బీపీ, షుగర్‌ మందులకు డిమాండ్‌

అజిత్రోమైసిన్, క్లోరోక్విన్‌ మాత్రల అమ్మకాలపై నియంత్రణ

క్లోరోక్విన్‌ మాత్రలను వెనక్కి తీసుకుంటున్న ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. వైరస్‌ను కట్టడి చేసేందుకు దోహదం చేసే మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్, డెటాల్‌ తదితర ఉత్పత్తుల రేట్లు గణనీయంగా పెరిగాయి. మరోవైపు కృతిమ కొరత కూడా సృష్టిస్తూ రేట్లు పెంచి యథేచ్ఛగా అమ్మకాలు జరుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తారనే ప్రచారంతో రక్తపోటు, మధుమేహానికి సంబంధించిన మాత్రలు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. ఇక అజిత్రోమైసిన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలకు ఎక్కడ లేని డిమాండ్‌ పెరిగింది. అజిత్రోమైసిన్‌ మాత్ర రూ.22 ఉండగా, ఇప్పుడు రూ.30–32 వరకు పలుకుతోంది.

మాస్కులకు కటకట..
కరోనా మహమ్మారి విశ్వరూపం చూపుతుండటం.. వైరస్‌ నియంత్రణకు నిరంతరం చేతులు శుభ్రం చేసుకోవాలని, మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు, ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. దీంతో మార్కెట్‌లో మాస్కులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఇక ఎన్‌–95 మాస్కుల ధరలకైతే రెక్కలొచ్చాయి. నెల రోజుల క్రితం వరకు రూ.75 ఉన్న ఈ మాస్కు ధర ప్రస్తుతం రూ.350 నుంచి 400కు చేరింది. మామూలు మాస్కుల ధర రూ.3–5 నుంచి 25–30 వరకు పెరిగింది. ఇక హ్యాండ్‌వాష్‌లు అంతంతగానే లభ్యమవుతున్నాయి. హ్యాండ్‌వాష్‌కు ఉపయోగించే శానిటైజర్లు, డెటాల్, శావిలియన్‌ సబ్బులు కూడా దొరకడంలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు నకిలీ శానిటైజర్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. కరోనా భయంతో ఉన్న ప్రజలను మోసగించేందుకు నకిలీ శానిటైజర్ల తయారీ ముఠాలు రంగంలోకి దిగాయి. పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేయడంతో నకిలీ శానిటైజర్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. నకిలీ శానిటైజర్ల వాడకంతో చేతులకు బొబ్బలు వస్తున్నట్లు గుర్తించినందున జాగ్రత్త వ్యవహరించాలని సూచించింది. మరోవైపు ప్రముఖ కంపెనీలు విక్రయించే శానిటైజర్ల కొరత తీవ్రంగా ఉంది. దీనికితోడు లాక్‌డౌన్‌తో సరుకు రవాణా నిలిచిపోవడం, ఉత్పత్తులపై కూడా ప్రభావం చూపడంతో ప్రస్తుతం మార్కెట్‌లో శానిటైజర్లు మచ్చుకైనా కనిపించట్లేదు.

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ అమ్మకాలు బంద్‌
హైడ్రాక్సీ క్లోరోక్విన్, హెచ్‌సీక్యూఎస్‌ టాబ్లెట్‌ల అమ్మకాలను ప్రభుత్వం దాదాపు నిలిపేసింది. శ్వాసకోస, మలేరియా రోగుల కోసం వినియోగించే ఈ మాత్రలే ప్రస్తుతం కరోనా బాధితుల కోసం ఉపయోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉపద్రవం ముంచుకొస్తే ఈ మాత్రల కొరత రాకుండా ముందస్తు జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే హోల్‌సేల్‌ డీలర్ల నుంచే కాకుండా మెడికల్‌ షాపుల నిర్వాహకుల వద్ద ఉన్న ఈ మాత్రలను వెనక్కి తీసుకుంటున్నట్లు సమాచారం. పైగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందులు విచ్చలవిడిగా వాడితే గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని, డాక్టర్ల సలహా మేరకు మాత్రమే వాడాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలావుండగా, బీపీ, షుగర్‌ పేషెంట్లు మాత్రం ముందుచూపుతో మూడు నెలలకు సరిపడా మందులు కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ రోగుల మాత్రలు ఇట్టే అమ్ముడుపోతున్నట్లు మందుల దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే.. కండోమ్‌ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో 15 రోజులు ఎవరూ గడప దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి లేకపోవడంతో అంతా ఇంటికి పరిమితమయ్యారు. కరోనాకు ముందు మార్కెట్‌లో కండోమ్‌ల అమ్మకాలు విరివిగా ఉండేవి. ప్రస్తుతం వీటిని అడిగేవారే కరువయ్యారని ఓ మెడికల్‌ షాప్‌ నిర్వాహకుడు చెప్పారు.

మరిన్ని వార్తలు