డిష్‌ వాష్‌ కరోనా!

23 May, 2020 03:11 IST|Sakshi

కోవిడ్‌–19 నేపథ్యంలో డిష్‌ వాషర్లు ఎక్కువగా కొంటున్న హైదరాబాదీలు

పనిమనుషులకు బదులు గిన్నెలుతోమే యంత్రంతో పనులు

నెలకు 7–8 విక్రయించే షోరూంలలో 3–4 రోజులకు పదేసి అమ్మకం

రూ. 30 వేల నుంచి 50 వేల మధ్య పలుకుతున్న ధర

ఎలక్ట్రానిక్‌ షాపుల కళకళ.. మొబైల్స్, ల్యాప్‌టాప్‌లకూ పెరిగిన డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇంటి నుంచి బయటకు వెళ్తే మొహానికి మాస్కు ధరించడం.. భౌతికదూరం పాటించడం.. శానిటైజర్‌ రాసుకోవడం... కరోనా కట్టడి కోసం ఇప్పుడు మనమంతా చేస్తున్న పని. ఇంతవరకు బాగానే ఉంది. మరి నిత్యం గిన్నెలు తోమేందుకు ఇళ్లకు వచ్చే పనిమనుషులు మనలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో తెలి యదు. అందుకే హైదరాబాద్‌లో చాలా మంది పనిమనుషులను దూరం పెట్టారు. మరి వారు రాకుండా ఎంతకాలం నెట్టుకురాగలరు? ఇందుకు వారికి లభించిన సమాధానమే డిష్‌ వాషర్‌. లాక్‌ డౌన్‌ సడలింపులతో ప్రజలు డిష్‌ వాషర్ల కొనుగోలు కోసం ఎలక్ట్రానిక్‌ షోరూంలకు వెళ్తున్నారు.

ల్యాప్‌టాప్‌లకూ పెరిగిన గిరాకీ...
కరోనా ఇప్పట్లో వదిలే అవకాశం లేక పోవడంతో విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ చదువులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఇందుకు అనువుగా ఉండే ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల కోసం తల్లిదండ్రులు ఎలక్ట్రానిక్‌ షోరూంలకు అధికంగా వెళ్తున్నారు. ‘‘లాక్‌డౌన్‌ కంటే ముందు మా షోరూంకు నిత్యం 60 నుంచి 70 మంది వచ్చే వారు. ఇప్పుడు ఆ సంఖ్య 100 దాటుతోంది. ఏసీలు, టీవీలు, కూలర్లు, ల్యాప్‌టాప్‌లు, వాషింగ్‌ మెషీన్లు, డిష్‌ వాషర్లు కొంటున్నారు. ఇప్పుడు సరి–బేసి విధానం వల్ల కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతోందా తగ్గుతోందా అనేది ఇంకా అంచనా వేయాల్సి ఉంది. మరో వారం తర్వాత ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. జనం భయం వదిలి కొనుగోలుకు ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది’’ అని మరో ప్రధాన షోరూం నిర్వాహకుడు పేర్కొన్నారు.

తెలియని వస్తువే అయినా...
డిష్‌ వాషర్‌ సాధారణ కుటుంబాలకు అంతగా పరిచయం లేనిది. బట్టలు ఉతికేందుకు వాషింగ్‌ మెషీన్‌ వాడకం సాధారణమే కానీ డిష్‌ వాషర్‌ పేరు వినడమే ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఇది గిన్నెలు తోమే యం త్రం. వాషింగ్‌ మెషీ న్లలో బట్టలు, వాషింగ్‌ పౌడర్‌ వేసి సమయం సెట్‌ చేస్తే దాని పని ఎలా చేసుకుంటూ వెళ్తుందో అదే తరహాలో డిష్‌ వాషర్‌ కూడా పనిచేస్తుంది. పళ్లాలు, గిన్నె లు, గ్లాసులను వాటి సైజుల ప్రకారం యంత్రంలో ఉంచి లిక్విడ్‌ డిటెర్జంట్‌ వేసి సమయం నిర్దేశిస్తే చాలు.

ప్రస్తుతం మార్కెట్లో రూ. 30 వేల నుంచి రూ. 50 వేల మధ్య డిష్‌ వాషర్ల ధర పలుకు తోంది. సైజు, నాణ్యత, కంపెనీల ఆధారంగా ధరల్లో తేడాలున్నాయి. ఇంటిల్లి పాదీ బోళ్లు తోమేం దుకు ఇది అనుకూలంగా ఉండటంతో వాటిని కొనే స్తోమత ఉన్న వాళ్లు ఆసక్తి చూపుతున్నారు. ‘గతంలో నెలలో మేం 7–8 వరకు వీటిని అమ్మే వాళ్లం. కానీ ఇప్పుడు లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత గత మూడు నాలుగు రోజుల్లో 10 వరకు అమ్మేశాం. త్వరలో వీటి కొనుగోళ్లు మరింత పెరుగుతాయి’ అని నగరంలో ఓ ప్రధాన ఎలక్ట్రానిక్‌ షోరూం ఇన్‌చార్జి పేర్కొన్నారు. ఇక వాషింగ్‌ మెషీన్ల కొనుగోలు కూడా గతంతో పోలిస్తే పెరిగింది.

>
మరిన్ని వార్తలు