ఇక్కడ లైసెన్స్‌.. అక్కడ షికారు..

7 Jan, 2020 09:08 IST|Sakshi

ఏడాదిపాటు ఆయా దేశాల్లో చెల్లుబాటు

ఇక్కడి లైసెన్స్‌తో కార్లు, బైకులు నడిపే అవకాశం

ఏడాదిలో 9 వేలకు పైగా లైసెన్సుల జారీ

గత ఐదేళ్లలో ఇదే రికార్డు

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో కారు నడిపినా, బైక్‌ నడిపినా ప్రపంచంలోఎక్కడైనా సరే ఇట్టే దూసుకుపోవచ్చు. ఇరుకైన రోడ్లు, వాహనాల రద్దీ, ట్రాఫిక్‌ నిబంధనలు, నిరంతర అప్రమత్తతవాహనదారులకు ప్రతిరోజు పాఠాలు నేర్పుతూనే ఉంటాయి. అందుకే సిటీలోబండి నడిపిన వాళ్లు విదేశాల్లో  హాయిగా ఝామ్మంటూ దూసుకెళ్తున్నారు. విదేశీ రహదారులపై పరుగులు పెడుతున్నారు. అందుకే  నగరంలోఅంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్సులకు ఎంతో డిమాండ్‌ ఉంది. నగరంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతి రోజు సాధారణ డ్రైవింగ్‌ లైసెన్సులతో పాటు వందల సంఖ్యలో అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్సులు  విడుదలవుతున్నాయి. 2019లో  గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఏకంగా 9919 అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్సులు జారీ కావడం గమనార్హం. గత ఐదేళ్లలో ఇదే సరికొత్త రికార్డు. గ్రేటర్‌ పరిధిలో ఈ ఐదేళ్లలో 39835 ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్సులు అందజేశారు. ఈ లైసెన్సులకు  అంతర్జాతీయ స్థాయిలో సముచితమైన గుర్తింపు, అర్హత ఉండడమే ఇందుకు కారణం. విద్య, ఉద్యోగం, వ్యాపారం కోసం వెళ్లేవాళ్లే కాదు..పర్యాటక వీసాలపైన వెళ్లేవాళ్లు, బంధువుల ఇళ్లకు వెళ్లేవాళ్లు సైతం తప్పనిసరిగా అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్సులు తీసుకోవడం విశేషం. 

ఏడాది పాటు చెల్లుబాటు...
తెలంగాణ రవాణాశాఖ అందజేసే ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్సులకు విదేశాల్లో ఏడాది పాటు చెల్లుబాటు ఉంటుంది. ఇక్కడ తీసుకున్న లైసెన్సుల ఆధారంగా ఆయా దేశాల్లో బండి నడిపేందుకు అనుమతినిస్తారు. ఒకవేళ విదేశాల్లో శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకోవాలంటే అక్కడి నిబంధనల మేరకు లైసెన్సులు తీసుకోవలసి ఉంటుంది. చాలా దేశాల్లో ఈ నిబంధనలు కఠినంగా ఉండడం వల్ల ఎక్కువ మంది నగరం నుంచి ఇంటర్నేషనల్‌ లైసెన్సులను తీసుకుంటున్నారు. అమెరికాతో పాటు అన్ని యురోప్‌ దేశాల్లో, ఆసియా దేశాల్లో మన ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్సులకు ఏడాది పాటు చెల్లుబాటు ఉండడం వల్ల అక్కడికి వెళ్లిన వెంటనే వాహనం నడిపేందుకు అవకాశం లభిస్తుంది. మరోవైపు  రోడ్డు భద్రతా నిబంధనలు పటిష్టంగా ఉండడం, ట్రాఫిక్‌ రద్దీ  లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా కారు నడిపేందుకు అవకాశం ఉంటుందని స్టూడెంట్‌ వీసాపై జర్మనీలో ఉంటున్న తరుణ్‌ తెలిపారు. ఏడాది దాటిన తరువాత కూడా అక్కడే ఉండాలనుకొంటే తప్పనిసరిగా అక్కడి నిబంధనలకు అనుగుణంగా లైసెన్సుతీసుకోవలసిందే.

మహిళలు సైతం భారీ సంఖ్యలోనే...
హైదరాబాద్‌ నుంచి అంతర్జాతీయ లైసెన్సులు తీసుకుంటున్న వారిలో మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. వీరిలో ఎక్కువగా  అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో  ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. ఇప్పటి వరకు రవాణాశాఖ ఇచ్చిన 39835 అంతర్జాతీయ లైసెన్సులలో  సుమారు 10,500 మహిళలు ఉన్నారు. ‘‘ విదేశాల్లో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టుపైన ఆధారపడేందుకు ఎక్కువగా అవకాశం లేకపోవడం, సొంత వాహనాలను వినియోగంచడం తప్పనిసరి కావడంతో ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడే  ఇంటర్నేషనల్‌ లైసెన్సు తీసుకెళ్తున్నారు.’’ అని నాగోల్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌  ప్రాంతీయ రవాణా అధికారి సురేష్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. 

ఎలా తీసుకోవాలి....
అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకోవాలంటే వ్యాలిడిటీ ఉన్న ఇండియన్‌ డ్రైవింగ్‌ లైసెన్సు తప్పనిసరి.  
పాస్‌పోర్టు, వీసా, అడ్రస్, తదితర డాక్యుమెంట్‌లు ఉండాలి.
ఆర్టీఏ వెబ్‌సైట్‌లో స్లాట్‌ నమోదు చేసుకోవాలి. రూ.1500 వరకు ఫీజు ఆన్‌లైన్‌లో లేదా,  ఈ–సేవా కేంద్రాల్లో  చెల్లించాలి.
అనంతరం సబంధిత ప్రాంతీయ రవాణా అధికారిని సంప్రదించాలి. ఒరిజనల్, జిరాక్స్‌ డాక్యుమెంట్‌లన్నింటినీ పరిశీలించిన అనంతరం అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్సులను  ఇస్తారు. 

గత ఐదేళ్లలో హైదరాబాద్‌ నుంచి  జారీ అయిన డ్రైవింగ్‌ లైసెన్సులు...
2015 – 9606
2016 – 7024
2017 – 5862
2018 – 7424
2019 – 9919
మొత్తం :  39835

మరిన్ని వార్తలు