గళమెత్తిన గల్ఫ్‌ వలసజీవులు

8 Apr, 2018 02:16 IST|Sakshi

ఎన్‌ఆర్‌ఐ పాలసీ కోసం డిమాండ్‌

సిరిసిల్ల: మూడున్నరేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐ పాలసీ రూపొందించక పోవడంపై గల్ఫ్‌ వలసజీవులు శుక్రవారం నిరసన గళమెత్తారు. బతుకుదెరువు కోసం గల్ఫ్‌బాట పట్టిన వలసజీవులు సర్కారుపై నిరసన తెలిపారు. నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్‌ (ఎన్‌ఆర్‌ఐ) పాలసీ రూపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లుగా విఫలమైందని పేర్కొంటూ నిరసన గళాన్ని వినిపించారు. దుబాయ్‌లోని జబిల్‌పార్క్‌లో ప్రవాస తెలంగాణ వలసజీవులు సమావేశమై ఎన్‌ఆర్‌ఐ పాలసీ రూపొందించాలని డిమాండ్‌ చేశారు. 

తొలిసారిగా దుబాయ్‌లో ఒకే వేదికపై తెలంగాణ గల్ఫ్‌ సంఘాలు, ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశమై వలసజీవుల కష్టాలను చర్చించుకున్నారు. నకిలీ గల్ఫ్‌ ఏజెంట్లను నిరోధించి విజిటింగ్‌ వీసాలపై గల్ఫ్‌కు పంపే విధానాలను అడ్డుకోవాలని కోరారు. గల్ఫ్‌కు వెళ్లేవారికి ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని, గల్ఫ్‌బాటలో నష్టపోయి ఇంటికి చేరినవారికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించి పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

గల్ఫ్‌లో ఎవరైనా చనిపోతే మృతదేహం స్వగ్రామం చేరేవిధంగా భారత ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలను చేపట్టాలని వారు కోరారు. తెలంగాణ ప్రవాసుల కోసం రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేకనిధి ఏర్పాటు చేసి సంక్షేమం, ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు.  

రెండు నెలల గడువు
రెండునెలల్లో ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐ పాలసీని రూపొందించే విషయంలో స్పందించాలని వలస జీవులు కోరారు. లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని దుబాయ్‌లోని తెలంగాణ సంఘాలు నిర్ణయించాయి.  

మరిన్ని వార్తలు