ఆ ఆత్మహత్యలకు సర్కారుదే బాధ్యత

12 May, 2019 04:41 IST|Sakshi

ఇందిరాపార్క్‌ వద్ద అఖిల పక్షం నేతల ధర్నా 

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలు హాజరు 

బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ 

విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై రాష్ట్రపతిని కలుస్తామని అఖిలపక్ష నేతలు ప్రకటించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు సర్కారుదే బాధ్యతని, వారి తల్లిదండ్రులకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ‘ఇంటర్‌’అవకతవకలపై కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్, జనసేన, తెలంగాణ ఇంటి పార్టీ శనివారం ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాయి. విద్యామంత్రి జగదీశ్‌రెడ్డిని తక్షణమే బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌ నేత కుంతియా డిమాండ్‌ చేశారు. లేదంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ హస్తం కూడా ఉందని భావించాల్సి వస్తుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ఇంటర్‌ సమస్యకు పరిష్కారం చూపకపోతే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం హెచ్చరించారు.

3 రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కీలక సమయాల్లో ముఖ్యమంత్రి విహార యాత్రలకు వెళ్లడమేంటని మండిపడ్డారు. ఇంటర్‌ బోర్డు అవకతవకల ఘటనకు నూటికి నూరుపాళ్లు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఇసుక మాఫియా తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో విద్యా మాఫియా నడుస్తోందని టీటీడీపీ అధ్యక్షుడు రమణ అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులైన వారిని శిక్షించాలని, ఆయా కుటుంబాలకు న్యాయం చేయాలని ఎంఆర్‌పీఎస్‌ నేత మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఆ కుటుంబాలకు న్యాయం చేయకపోతే కేసీఆర్‌ను గద్దె దించే వరకు పోరాటం చేస్తామన్నారు. నాడు డిప్యూటీ సీఎం రాజయ్యను అకారణంగా తొలగించారని, ఇప్పుడు ఇన్ని తప్పులు జరిగినా జగదీశ్‌రెడ్డిని ఎందుకు బర్తరఫ్‌ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్, తెలంగాణ జనసేన అధ్యక్షుడు నేమూరి శంకర్‌ గౌడ్‌ మాట్లాడారు.  

తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు... 
ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కూడా కార్యక్రమం లో మాట్లాడారు. వారు మాట్లాడుతున్నంతసేపు అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మహేశ్వరి తల్లి మాట్లాడుతూ.. తమ కుమార్తె కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుందని కన్నీటి పర్యంతమయ్యారు. తనకు ఒకతే బిడ్డ అని.. ఎవరూ లేరన్నారు. అనామిక తల్లిదండ్రులు, అమ్మమ్మ మాట్లాడుతూ... కేసీఆర్‌ ఇంత మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వీహెచ్, నగేశ్‌ బాహాబాహీ
సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వీహెచ్, టీపీసీసీ అధికార ప్రతినిధి నగేశ్‌ బాహాబాహీకి దిగారు. దీంతో ధర్నా కార్యక్రమం రసాభాసగా మారింది. వేదికపై నుంచి వీహెచ్‌ మాట్లాడుతుండగా, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా అక్కడికి వచ్చారు. అదే సమయంలో నగేశ్‌ కూడా వేదిక పైకి వెళ్లారు. కుంతియా కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో ఆయన కూర్చునేందుకు యత్నించారు. ఈ క్రమంలో నగేశ్, వీహెచ్‌ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వీహెచ్‌ చేయి చేసుకోవడంతో నగేశ్‌ ఆయన చొక్కా పట్టుకున్నారు.

తోపులాటలో ఇద్దరూ కిందపడిపోయారు. అప్రమత్తమైన అఖిలపక్ష నేతలు ఇద్దరి మధ్య సయోధ్యకు యత్నించారు. పార్టీ రాష్ట్ర ఇన్‌చా ర్జి వచ్చినప్పుడు బాధ్యతగల నాయకుడు ఇలా ప్రవర్తించడం సరికాదంటూ వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాం, నారాయణ జోక్యం చేసుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. చనిపోయిన పిల్లల కుటుంబాల ముందు ఇలా మనం కొట్టుకోవడం వారిని అవమానించడమేనని కోదండరాం అన్నా రు. కావాలంటే మీరు గాంధీభవన్‌లో కొట్లాడుకోం డంటూ సీపీఐ నేత నారాయణ కాంగ్రెస్‌ నాయకులపై మండిపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు