ఐటీడీఏ ముట్టడికి యత్నం

31 Oct, 2019 03:31 IST|Sakshi
ఐటీడీఏ ప్రధాన ద్వారం ఎదుట ఆదివాసీల ఆందోళన

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదివాసీలు మళ్లీ పోరుబాట పట్టారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని కోరుతూ బుధవారం ఐటీడీఏ కార్యాలయ ముట్టడికి యత్నించారు. భారీగా తరలివచ్చిన ఆదివాసీలను పోలీసులు కట్టడి చేసే క్రమంలో తోపులాట, వాగ్వాదం జరిగింది. ఒక దశలో కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ కుమురంభీం కాంప్లెక్స్‌లో బుధ వారం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించారు.  ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ నినాదాలు చేశారు. లోపల సమావేశం జరుగుతుండగా.. వెలుపల ఆదివాసీలు నినాదాలతో  హోరెత్తించారు.  లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులకు, ఆదివాసీలకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పే అవకాశాలు కనిపించడంతో కలెక్టర్‌ దివ్యదేవరాజన్, ఐటీడీఏ పీఓ కృష్ణ ఆదిత్యలు బయటకు వచ్చి ఆదివాసీలను శాంతింపజేసేందుకు యత్నించారు.

వారి ప్రధాన డిమాండ్‌పై సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ వేసినందున తీర్పు వచ్చేవరకూ ఆగాలన్నారు. ఏజెన్సీలో డీఎస్సీ నిర్వహిం చేందుకు ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో తీర్మా నం చేసి ప్రభుత్వానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. 
 

మరిన్ని వార్తలు