చేపల మార్కెట్ కూల్చివేత

9 Nov, 2014 00:06 IST|Sakshi

సంగారెడ్డి మున్సిపాలిటీ :  ఆకస్మికంగా చేపల మార్కెట్‌ను కూల్చి వేయడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనలో చేపలు కొనుగోలు చేయడానికి వచ్చిన మహిళ తలకు గాయమైంది. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ రమేష్ అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.

పట్టణంలోని గంజిమైదాన్‌లో 50 సంవత్సరాలుగా చేపలు వ్యాపారం చేసుకుంటూ గంగ పుత్రులు జీవనం కొనసాగిస్తున్నారు. కాగా గత ఏడాది మత్స్య కార్మిక సహకార సంఘం సంగారెడ్డి వారికి రూ.10 లక్షల వ్యయంతో ప్రభుత్వం చేపల మార్కెట్‌ను నిర్మించింది. దీంతో సంగారెడ్డి మత్స్యకార్మికులకు అందులో చేపలు విక్రయించేందుకు గాను షాపులను కేటాయించారు. ఇదిలా ఉండగా.. కల ్పగూర్ గ్రామస్తులకు చేపల మార్కెట్‌లో గల షాపింగ్ కాంప్లెక్స్‌లోకి చేపల వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదు.

దీంతో వారు చాలా కాలంగా గంజి రోడ్డు ఇరువైపుల చేపలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కాగా కల ్పగూర్ గ్రామ వ్యాపారులు కాంప్లెక్స్‌కు ముందుగా బహిరంగంగా విక్రయించడంతో తమకు గిరాకీ రావడం లేదని సంగారెడ్డికి చెందిన పలువురు మత్స్యకార్మికులు మున్సిపల్ కమిషనర్‌ను ఆశ్రయించారు. కల్పగూర్ గ్రామ చేపల వ్యాపారులు రోడ్డుపై విక్రయాలు జరపకుండా అడ్డుకోవాలని కోరారు. అయితే కమిషనర్ వాస్తవ పరిస్థితిని గమనించకుండానే కల్పగూర్ గ్రామ చేపల వ్యాపారులకు  రోడ్డుపైన చేపలు విక్రయించద్దని సిబ్బందితో నోటీసులు అందజేశారు.

దీంతో వారు తమకు షాపింగ్ కాంప్లెక్స్‌లో అనుమతి లేనందున ఎక్కడ విక్రయించుకోవాలో స్థలాన్ని చూపిస్తే అక్కడే విక్రయించుకుంటామని కమిషనర్ ఇచ్చిన నోటీసులకు బదులిచ్చారు. కానీ శనివారం స్థానిక మత్స్య కార్మికులు మున్సిపల్ సిబ్బందిని వెంట వేసుకుని కల ్పగూర్ గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న షెడ్లను కూల్చివేశారు. దీంతో ఇరువురి మధ్య వాదనలను జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సమాచారం అందుకున్న  పట్టణ పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురిని శాంతింపచేశారు. కాగా సంగారెడ్డికి చెందిన మత్స్య కార్మికులు తమపై దౌర్జన్యంగా దాడికి పాల్పడ్డారని కల ్పగూర్ గ్రామ మత్సకార్మికులు ఆరోపించారు. తాము చేపలు విక్రయిస్త్తుండగానే తమ షెడ్లను కూల్చివేయడంతో కోనుగోలు చేయడానికి వచ్చిన ఓ మహిళ తలకు గాయమైంది. తమ షెడ్లను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు