క్యాష్‌లెస్‌ 30 శాతమే !

8 Nov, 2017 12:23 IST|Sakshi

మోర్తాడ్‌(బాల్కొండ) /నిజామాబాద్‌అర్బన్‌:  జిల్లాలోని 25 ఎస్‌బీఐ శాఖలను క్యాష్‌లెస్‌ బ్యాంకింగ్‌ కోసం పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అందులో మోర్తాడ్‌ మండలంలోని సుంకెట్, తిమ్మాపూర్, కమ్మర్‌పల్లి మండలంలోని చౌట్‌పల్లి, కిసాన్‌నగర్, తొర్లికొండ ఎస్‌బీఐ శాఖలతో పాటు మరో 20 ఎస్‌బీఐ శాఖలు ఉన్నాయి. ఈ బ్యాంకుల పరిధిలో క్యాష్‌ను అసలే వినియోగించకూడదని పూర్తిగా డిజిటల్‌ లావాదేవీలనే నిర్వహించాలని ఉన్నతాధికారులు సూచించారు. బ్యాంకు శాఖ పరిధిలోని వ్యాపారులకు స్వైప్‌ యంత్రాలను అందించి క్యాష్‌లెస్‌ లావాదేవీలను నిర్వహించేలా చూడాలని సూచించారు. కాని స్వైప్‌ యంత్రాలను ఆశించిన విధంగా సరఫరా చేయకపోవడంతో నగదు రహితం నామమాత్రమే అయ్యింది. 

కాగా గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం క్యాష్‌లెస్‌ లావాదేవీలను నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయం అని బ్యాంకర్లు చెబుతున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంతో బ్యాంకుల్లో కాగితాలతో పని లేకుండా పోయిందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా నగదు కొరత వల్ల బ్యాంకుల్లో తక్కువ మొత్తంలో డ్రా చేసుకోవడానికే అధికారులు అనుమతి ఇస్తున్నారు. ప్రజలు మాత్రం తమకు అవసరమైన నగదును డ్రా చేసుకోవడానికి రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మరోవైపు పెద్ద నోట్లు రద్దయి ఏడాది పూర్తియినా ప్రజలకు ఇంకా నోట్ల కష్టాలు తప్పలేదు. 

జిల్లాలో 268 బ్యాంకులు ఉన్నాయి. ఇందులో 33 ప్రెయివేటు బ్యాంకులు ఉన్నాయి. 245 ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉండకపోవడం తరచుగా తలెత్తుతున్న సమస్య. ప్రస్తుతం ఏటీఎంలలో రెండువేల నోట్లు కొన్నిసార్లు మాత్రమే అందుబాటులోకి వస్తున్నాయి. ఏటీఎంలలో ఐదు వందల నోట్లు అందుబాటులో ఉంచుతున్నారు.   వరుసగా సెలవులు వస్తే, పండుగల సందర్భాలలో ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో ఉండటం లేదు. కొన్ని ప్రాంతాలలో ఏటీఎంలు నోట్ల రద్దు తర్వాత పని చేయడం లేదు. నోట్ల రద్దు తర్వాత ఆర్‌బీఐ కొత్తగా రూ.200, రూ. 50 కొత్త నోట్లు తీసుకువచ్చింది. 

మొదట్లో స్వైపింగ్‌ యంత్రాల హడావుడి సాగినా.. ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలు తగ్గిపోయాయి. కొద్ది మంది మాత్రమే కొన్ని చోట్ల స్వైపింగ్‌ విధానాన్ని కొనసాగిస్తున్నారు. నగదురహిత లావాదేవీల కోసం ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలు అంతగా ప్రయోజనాన్ని ఇవ్వలేదు. పట్టణ ప్రాంతాల్లో సైతం నగదురహిత లావాదేవీలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. స్వైపింగ్‌యంత్రాల ద్వారా కొనుగోలు చేస్తే వినియోగదారుడికే పన్నుభారం పడటంతో కొనుగోలు చేపట్టడం లేదు.  

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని ఉగ్రవాయి గ్రామంలో 409 కుటుంబాలు ఉండగా మొత్తం జనాభా 1374  ఉన్నారు. పిల్లలుపోను మిగతా 1,156 మందికి బ్యాంకు ఖాతాలు ఇచ్చారు. కామారెడ్డి పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌బ్యాంక్‌లలో వారి ఖాతాలు ఉన్నాయి. నగదు రహిత లావాదేవీల గురించి గ్రామంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. 

గ్రామంలో కిరాణ దుకాణాలు, మెడికల్‌ షాప్, హోటళ్లు, కల్లు దుకాణాలు.. ఇలా మొత్తంగా 17 మంది వద్ద స్వైప్‌ మిషన్లు ఏర్పాటు చేయడానికి అధికారులు బ్యాంకర్లకు ప్రతిపాదనలు పంపించారు. అయితే కిరాణ దుకాణం నిర్వహించే రాచర్ల చంద్రం, హోటల్‌ నిర్వాహకుడు చంద్రాగౌడ్, రేషన్‌ డీలర్‌ లావణ్య, గ్రామ పంచాయతి, వాటర్‌ ప్లాంట్‌ నిర్వాహకులు మాత్రమే స్వైపింగ్‌ మిషన్లు తీసుకున్నారు. గ్రామంలో చాలా మంది క్యాష్‌లెస్‌ ట్రాన్జాక్షన్స్‌కు దూరంగా ఉన్నారు. చదువురాదని కొంద రు, ఖాతాలో సొమ్ము దాచుకునే స్థోమత లేక ఇంకొందరు.. పాతపద్ధతిలోనే లావాదేవీలు జ రిపారు. 70 నుంచి 80 మంది మాత్రం నూతన విధానాన్ని అనుసరించారు. ఏటీఎం కార్డులతో లావాదేవీలు జరిపారు. రెండు మూడు నెలలు క్యాష్‌లెస్‌ లావాదేవీలు జరిగాయి. అయితే కొత్తనోట్ల చలామణి పెరగడంతో నగదు కష్టాలు తగ్గాయి. దీంతో ప్రజలు క్రమంగా క్యాష్‌లెస్‌ ట్రాన్జాక్షన్స్‌కు దూరమయ్యారు. 

మరిన్ని వార్తలు