రియల్‌ ఎస్టేట్‌కు 8/11 షాక్‌!

8 Nov, 2017 04:37 IST|Sakshi

నేటితో పెద్ద నోట్ల రద్దుకు ఏడాది.. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి భారీగా దెబ్బ

హైదరాబాద్‌లో ఆగిపోయిన కొత్త ప్రాజెక్టులు

దాదాపు ఆరు వేల రియల్‌ ప్రాజెక్టులు, వెంచర్లపై ప్రభావం

ప్లాట్లు అమ్మాలన్నా, కొనాలన్నా ఇబ్బందులే

ఒకప్పుడు భద్రంగా కనిపించిన బ్యాంకులు.. ఇప్పుడు వాటిని చూస్తేనే భయం

ఆదాయ పన్ను శాఖకు లింకు చేయడంతో డిపాజిట్లు చేసేందుకు జంకు

డిజిటల్‌ లావాదేవీల్లో తెలంగాణ నంబర్‌ వన్‌

నోట్ల రద్దు నాటి నుంచి 34 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు

ఆదాయపన్ను చెల్లింపుదారులు 40 శాతం వరకు పెరిగినట్లు అంచనా

సాక్షి, హైదరాబాద్‌ : సరిగ్గా ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేసేసింది.. పేద ప్రజలు మొదలు వ్యాపారవర్గాల వరకు ఒక్కసారిగా కలకలం చెలరేగింది.. దాదాపు మూడు నెలల పాటు పూర్తి గందరగోళం సృష్టించింది.. ఆ నోట్ల రద్దు పరిణామాలు రాష్ట్రంపై గణనీయస్థాయిలో ప్రభావం చూపాయి. ప్రధానంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కీలకమైన నిర్మాణ రంగాన్ని దెబ్బతీశాయి.

తీవ్రంగా ‘నగదు’ సంక్షోభం
గతేడాది నవంబర్‌ 8న కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసింది. ఈ ఏడాది వ్యవధిలో బ్యాంకు లావాదేవీలు, నగదు చలామణీ తీవ్ర సంక్షోభాన్ని చవిచూశాయి. రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేయటంతో మొదటి మూడు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలు స్తంభించిపోయాయి. నగదు కొరత కారణంగా నిత్యావసరాలు తప్ప మరేమీ కొనుగోలు చేయలేని దుస్థితి ఇంటింటా కనిపించింది. డబ్బులు తెచ్చుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు రోజుల తరబడి క్యూలు దర్శనమిచ్చాయి. ఈ ప్రభావం వ్యాపార, వాణిజ్య వర్గాలన్నింటిపైనా పడింది. చిన్నాచితక, చిల్లర వ్యాపారాలు చేసుకుని పొట్ట పోసుకునే సామాన్యులంతా తల్లడిల్లిపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు సైతం రోజువారీగా వచ్చే కూలి డబ్బులను అందుకోలేకపోయారు. క్రమంగా ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు నానా హంగామా చేశాయి. నగదు అందుబాటులో లేక గత్యంతరం లేని స్థితిలో డిజిటల్‌ లావాదేవీల దిశగా మార్కెట్‌ ముందుకు సాగింది. మొత్తంగా నోట్ల రద్దు నాటి నుంచి ఏకంగా 34 కోట్ల డిజిటల్‌ లావాదేవీలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు దాదాపు 212 గ్రామాలను నగదు రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, బ్యాంకులు స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించాయి. అయితే నగదు లావాదేవీలకు అలవాటు పడ్డ గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలను తీర్చలేకపోవటంతో అది మూడు నెలల ముచ్చటగానే ఆగిపోయింది.

రియల్‌ ఎస్టేట్‌పై పంజా
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకుంటున్న తరుణంలో నోట్ల రద్దు దెబ్బపడింది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. గతేడాది నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం దాదాపు రూ.500 కోట్ల మేర తగ్గిపోయింది. కేవలం నగదుపై ఆధారపడి జరిగే ప్లాట్లు, లేఅవుట్‌ లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడింది. భూముల క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. హైదరాబాద్‌ పరిసరాల్లోనే దాదాపు ఆరు వేల రియల్‌ ప్రాజెక్టులు, వెంచర్లు అర్ధంతరంగా ఆగిపోయాయి. దాంతో రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి కూడా గండిపడింది. జనం ప్లాట్లు కొనాలన్నా, అమ్మాలన్నా వెనుకంజ వేయడంతో.. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు ఆందోళనకర స్థాయిలో తగ్గాయి. రాష్ట్ర రాజధాని చుట్టుపక్కల 2015–16లో రూ.300 కోట్ల పెట్టుబడులురాగా.. 2016 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకు పెట్టుబడులు 35 శాతం తగ్గి.. కేవలం రూ.195 కోట్లకు పడిపోయాయి. దీంతో రియల్‌ఎస్టేట్‌ రంగంపై ఆధారపడిన ఉద్యోగులు, నిర్మాణ కూలీల వంటి వేలాది మంది ఉపాధి అవకాశాలూ దెబ్బతిన్నాయి.

బ్యాంకుల వైపు చూస్తేనే భయం!
నోట్ల రద్దు తర్వాత తమ బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులను విత్‌డ్రా చేసుకునేందుకు, పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేసుకునేందుకు ప్రజలు ముప్పుతిప్పలు పడ్డారు. అదే సమయంలో బ్యాంకర్లు వ్యవహరించిన తీరు, గంటల తరబడి నిరీక్షణలన్నీ బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రభావితం చేశాయి. దానికితోడు ఏటీఎం నుంచి, ఖాతాలో నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు రకరకాల ఆంక్షలు విధించటంతో ఖాతాదారులు బెంబేలెత్తిపోయారు. బ్యాంకులో డబ్బులు జమచేసి ఇబ్బంది పడేకంటే బ్యాంకులకు దూరంగా ఉండటమే మంచిదనే అభిప్రాయం వెల్లువెత్తింది. దాంతో దాదాపు ఆరు నెలల పాటు అత్యవసర లావాదేవీలు, నగదు విత్‌డ్రా తప్ప నగదు జమ చేసేందుకు బ్యాంకులకెవరూ రావడంలో లేదని ఆర్‌బీఐ సైతం విస్తుపోయింది.

40 శాతం పెరిగిన పన్నుదారులు
నోట్లరద్దు సమయంలోనే ప్రభుత్వం బ్యాంకు ఖాతాలను ఆధార్‌కు అనుసంధానం చేయటంతోపాటు ఖాతాల్లో లావాదేవీలపై ఐటీ శాఖను అప్రమత్తం చేసింది. దీనివల్ల రాష్ట్రంలో ఆదాయ పన్ను చెల్లింపుదారుల సంఖ్య దాదాపు 40 శాతం పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఐటీ భయం సామాన్యులు, చిన్న వ్యాపారులు, చిన్న, మధ్యతరగతి ఉద్యోగులను వెంటాడుతోంది. బ్యాంకు లావాదేవీలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమ పంటల పెట్టుబడులకు, పేద, మధ్య తరగతి కుటుంబాలు తమ పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం కూడబెట్టిన సొమ్ము సైతం ఐటీ పరిధిలోకి వెళుతుందనే భయం వెంటాడింది.

మరిన్ని వార్తలు