గ్రేటర్‌లో మృత్యుఘంటికలు

22 Nov, 2018 09:42 IST|Sakshi

ఒక వైపు డెంగీ.. మరో వైపు స్వైన్‌ఫ్లూ

వారం రోజుల్లోనే148 డెంగీ పాజిటివ్‌ కేసులు

92 శాతం కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదు

స్వైన్‌ఫ్లూ..చికిత్సల పేరుతో ప్రైవేట్‌ ఆస్పత్రుల   నిలువు దోపిడీ  

సాక్షి, సిటీబ్యూరో: ఒక వైపు స్వైన్‌ఫ్లూ..మరో వైపు డెంగీ జ్వరాలు గ్రేటర్‌ వాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వీధుల్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాల్సిన పారిశుద్ధ్య సిబ్బంది,  బస్తీల్లో ఫాగింగ్‌ నిర్వహించి దోమల వృద్ధిని నియంత్రించాల్సిన ఎంటమాలజీ విభాగం అధికారులు, సీజనల్‌ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో ఆయా విభాగాలు పడకేయడంతో డెంగీ, మలేరియా దోమలు బస్తీవాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి తర్వాత మరొకరు జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతుండటంతో గ్రేటర్‌వాసులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం వారం రోజుల్లోనే 3723 నమూనాలు పరీక్షించగా, 148 డెంగీ పాజిటివ్‌ కేసులుగా నిర్ధారణ అయ్యింది. ఇందులో 92 శాతం  కేవలం గ్రేటర్‌లోనే నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్‌ ఆస్పత్రులు చికిత్సల పేరుతో రోగులను నిలువు దోపిడీ చేస్తున్నాయి.

సాధారణంగా డెంగీ జ్వరం వచ్చిన వారిలో చాలా మందికి ఎలాంటి ప్రత్యేక చికిత్స అవసరం లేదు. నోటి ద్వారా ద్రావణాలను తాగించడం, ఐవీ ఫ్లూ యిడ్స్‌ ఎక్కించడం, పారాసెటమాల్‌ టాబ్లెట్‌ను ఇవ్వడం ద్వారా జ్వరం తగ్గిపోతుంది. అయితే ప్రైవేట్‌ ఆస్పత్రులు ఐసీయూలో అత్యవసర వైద్యసేవలు, ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ పేరుతో ఒక్కో రోగి నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తుండటం గమనార్హం.  

ప్లేట్‌లెట్స్‌ ప్రామాణికం కాదు..
ప్లేట్‌లెట్ల సంఖ్య లక్ష కంటే తగ్గిపోయినప్పుడు మాత్రమే ఆసుపత్రిలో చేర్చాలి. సంఖ్య 10 వేల కంటే తగ్గినప్పుడు మాత్రమే రక్తస్రావం ఉన్నా లేకపోయినా తిరిగి వాటిని భర్తీ చేయాలి. సంఖ్య 20 వేలలో ఉన్నప్పుడు.. రక్తస్రావ లక్షణాలు కనిపిస్తే అప్పుడు బయటి నుంచి ఎక్కించాల్సి ఉంటుంది. 20 వేలకంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఒకవేళ రక్తస్రావం అవుతుంటే.. ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా రక్తం గడ్డకట్టేందుకు అందించే చికిత్సలో భాగంగా ప్లాస్మాను ఎక్కిస్తారు. ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడం వల్ల అనర్థాలు రావడమనేది వ్యక్తిని బట్టి మారుతుంటాయి.

ప్లేట్‌లెట్ల సంఖ్యతోపాటు రక్తంలో ప్యాక్‌డ్‌ సెల్‌ వాల్యూమ్‌(పీసీవీ) ఎంత ఉంది? అనేది పరిశీలించడం ముఖ్యం. పీసీవీ సాధారణంగా ఉండాల్సిన దానికంటే 20 శాతం, అంతకంటే ఎక్కువైతే.. అత్యవసరంగా ఐవీ ఫ్లూయిడ్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. డెంగీలోనే కాకుండా  ఏ రక్త సంబంధ వ్యాధుల్లో అయినా.. అనవసరంగా ప్లేట్‌లెట్లు, ప్లాస్మాలను మోతాదుకు మించి ఇస్తే.. అక్యూట్‌ లంగ్‌ ఇన్‌జ్యూరీ, కొన్నిసార్లు అలర్జిక్‌ రియాక్షన్లు, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. రోగికి రక్త ఉత్పత్తుల అవసరం ఎంత మేరకు ఉంది? అనేది నిర్ధరించుకున్నాక.. రోగి ఆరోగ్య పరిస్థితి క్షీణించేందుకు అ వకాశాలున్నాయని గుర్తించిన తర్వాతే వాటిని వినియోగించాలి.

కోరలు చాస్తున్న స్వైన్‌ఫ్లూ
స్వైన్‌ఫ్లూ మళ్లీ మృత్యు ఘంటికలు మోగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2625పైగా నమూనాల పరీక్షించగా, వీటిలో 480 పాజిటివ్‌గా  నిర్ధారణ అయింది. బాధితుల్లో 16 మంది మృత్యువాత పడ్డారు. హైదరాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు 215 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇద్దరు చనిపోయారు.

రంగారెడ్డి జిల్లాలో 82 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో ముగ్గురు చనిపోయారు. మేడ్చల్‌ జిల్లాలో 80 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. ఇతర జిల్లాల్లో 103 పాటిటివ్‌ కేసులు నమోదు కాగా, పది మంది వరకు చనిపోయారు. బాధితుల్లో 90 శాతం మంది గ్రేటర్‌ పరిధిలోని జిల్లాలకు చెందిన వారే కావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ లక్షణాలు చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. అంత మాత్రాన జ్వరం, దగ్గు, ముక్కు కారడం తదితర లక్షణాలు కనిపించగానే స్వైన్‌ ఫ్లూగా భావించాల్సిన అవసరం లేదు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే మధుమేహులు, గర్బిణులు, పిల్లలు, వృద్ధులు, కిడ్నీ, కాలేయ మార్పిడి  చికిత్సలు చేయించుకున్న వారిలో ఫ్లూ భారిన పడే అవకాశాలు ఎక్కువ. స్వైన్‌ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడ, 101, 102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు కనిపిస్తాయి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తుమ్మిప్పుడు, దగ్గినప్పుడు చేతి రుమాలు అడ్డం పెట్టుకోవడం, బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం ద్వారా ఫ్లూ భారిన పడకుండా కాపాడుకోవచ్చు. 

మరిన్ని వార్తలు