డెంగీ.. స్వైన్‌ఫ్లూ.. నగరంపై ముప్పేట దాడి

20 Sep, 2019 08:25 IST|Sakshi

గ్రేటర్‌ను చుట్టుముట్టిన సీజనల్‌ వ్యాధులు

మృత్యు ఘంటికలు మోగిస్తున్న డెంగీ, ఫ్లూ జ్వరాలు

ఈ ఏడాది ఇప్పటి దాకా 38 మంది మృతి  

గురువారం మరో ఇద్దరు విద్యార్థులు బలి  

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌ను సీజనల్‌ వ్యాధులు చుట్టుముట్టాయి. ఇప్పటికే డెంగీ జ్వరాలు మృత్యు ఘంటికలు మోగిస్తుండగా, తాజాగా విస్తరిస్తున్న స్వైన్‌ఫ్లూ కూడా ప్రజల ప్రాణాలు తీస్తోంది. డెంగీతో ఇప్పటి వరకు 38 మంది మృతి చెందగా, స్వైన్‌ఫ్లూతో ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే 21 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా హెచ్‌1ఎన్‌1 స్వైన్‌ఫ్లూ కారక వైరస్‌ తన రూపాన్ని మార్చుకుంటూ గ్రేటర్‌ వాసులపై ముప్పేట దాడి చేస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గురువారం నిలోఫర్‌లో ఓ బాలిక డెంగీతో ప్రాణాలు వదలగా.. బోడుప్పల్‌కు చెందిన మరోవిద్యార్థి విషజ్వరంతో మరణించాడు.  

1106 ఫ్లూ కేసులు నమోదు
హైదరాబాద్‌లో మొదటిసారిగా 2009లో ‘హెచ్‌1ఎన్‌1’ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ వెలుగులోకి వచ్చింది. తర్వాత నగరంలో స్వైన్‌ఫ్లూ కేసులు, మరణాలు భారీగా  నమోదయ్యాయి. ఏడాది పాటు నిశ్శబ్దంగా ఉన్న వైరస్‌ మళ్లీ 2012లో తన ప్రతాపం చూపించింది. 2017కు ముందు ‘కాలిఫోర్నియా స్ట్రెయిన్‌’గా వ్యాప్తిలో ఉన్న వైరస్‌ రెండేళ్ల కిందట ‘మిషిగాన్‌ స్ట్రెయిన్‌’గా కొత్త అవతారమెత్తింది. గతేడాది కొంత తగ్గిన ఈ వైరస్‌ ఈ ఏడాది ఆరంభం నుంచే విజృంభిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో తీవ్రస్థాయిలో ప్రజల ప్రాణాలు తీస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,366 మంది నుంచి నమూనాలు సేక రించి పరీక్షించగా, వీరిలో 1297 మందికి స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీటిలో అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 671, రంగారెడ్డి జిల్లాలో 208, మేడ్చల్‌ జిల్లాలో 227 ప్లూపాజిటివ్‌ కేసులు నమోదవగా 21 మంది మృత్యువాత పడ్డారు. మారిన వాతావరణ పరిస్థితులకు తోడు ఇటీవల గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జనసమూహం లో ఎక్కువగా గడపడం వల్ల ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి సులభంగా విస్తురించినట్టు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

డెంగీతో 38 మంది మృతి
గ్రేటర్‌లో డెంగీ జ్వరాల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. పెద్దలతో పోలిస్తే చిన్నప్లిలల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం, స్కూలు పరిసరాల్లో పారిశుధ్య లోపం, ఇంటి పరిసరాల్లో పూలకుండీల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో వీరు ఎక్కువగా డెంగీ బారిన పడుతున్నారు. గ్రేటర్‌లో కేవలం పది రోజుల్లో 1,767 డెంగీ కేసులు నమోదు కాగా, బాధితుల్లో 50 శాతం మంది 14 ఏళ్లలోపు పిల్లలే. ఒక్క నిలోఫర్‌లోనే జూలై నుంచి ఇప్పటి వరకు సుమారు 900కి పైగా డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గాంధీ జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో కేవలం 12 రోజుల్లో 471 మంది జ్వరపీడితుల నుంచి రక్తపు నమూనాలు సేకరించి, పరీక్షించగా వీరిలో 109 మందికి డెంగీకి పాజిటివ్‌ నిర్థారణ అయింది. ఇప్పటి వరకు 38 మంది మృతి చెందగా, వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. అయితే, ప్రభుత్వం ఈ మరణాలను డెంగీ మరణాలుగా ధృవీకరించడం లేదు.

డెంగీ లక్షణాలు ఇలా
ఈడిస్‌ ఈజిఫ్టై (టైగర్‌ దోమ) కుట్టడం ద్వారా డెంగీ సోకుతుంది. పగటి పూట కుట్టే ఈ దోమ.. ప్రస్తుతం లైటింగ్‌ ఎక్కువగా ఉండటంతో రాత్రిపూట కూడా దాడి చేస్తోంది. దోమకుట్టిన 78 రోజులకు హఠాత్తుగా తీవ్రమైన జ్వరం రావడంతో పాటు కళ్లు కదలించలేని పరిస్థితి ఉంటుంది. ఎముకలు, కండరాల్లో నొప్పి, శరీరంపై ఎర్రటి పొక్కులు వస్తాయి. సాధారణంగా మనిషి రక్తంలో 1.50 నుంచి 4.50 లక్షల వరకు ప్లేట్‌లెట్స్‌ ఉంటాయి. డెంగీ బాధితుల్లో ఈ సంఖ్య 40 వేలలోపు పడిపోతుంది. 20 వేలకంటే తగ్గిపోతే ప్రమాదం.

పిల్లల ఆరోగ్యం జాగ్రత్త
పిల్లలు డెంగీ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు సాధ్యమైనంత వరకు కాళ్లు, చేతులు పూర్తిగా కవర్‌ చేసే దుస్తువులు వేయాలి. ఇంట్లో మస్కిటో మ్యాట్, మస్కిటో కాయిల్స్, ఆల్‌ అవుట్‌ వంటివాటితో దోమలను నియంత్రించాలి. ఇంట్లోని పూలకుండీలతో పాటు ఇంటిపై ఉన్న ఖాళీ డబ్బాలు, వాటర్‌ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఇంటి, పాఠశాల ఆవరణతో పాటు చుట్టుపక్కల పరిసరాల్లో పారిశుధ్యం లోపం లేకుండా చూడాలి. ఫాగింగ్, యాంటీ లార్వా చర్యల ద్వారా ఎప్పటికప్పుడు దోమలను నియంత్రించాలి.   – డాక్టర్‌ లాలూప్రసాద్‌ రాథోడ్,నిలోఫర్‌ ఆస్పత్రి

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
ఫ్లూ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వైరస్‌ గాలిలోకి ప్రవేశించి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతున్న వారు జన సమూహంలోనికి వెళ్లక పోవడమే ఉత్తమం. బాధితులు ఉపయోగించిన రుమాలు, టవల్‌ వంటివి వాడవద్దు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముఖానికి అడ్డంగా ఖర్చీఫ్‌ను పెట్టుకోవాలి. జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారితో కరచాలనం, ఆలింగనాలు చేయొద్దు. మందులు వాడుతున్నా లక్షణాలు తగ్గకపోతే స్వైన్‌ఫ్లూ కావచ్చేమోనని అనుమానించి వైద్యున్ని సంప్రదించాలి.  – డాక్టర్‌ శ్రీహర్ష, నోడల్‌ ఆఫీసర్, హైదరాబాద్‌ జిల్లా

మరిన్ని వార్తలు