విజృంభిస్తున్న డెంగీ

15 Aug, 2015 02:30 IST|Sakshi

రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్య
 
 వెల్దుర్తి : జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. చాలా మండలాల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. వెల్దుర్తి మండలం హస్తాల్‌పూరుకు చెందిన కొయ్యల దేవేందర్‌గౌడ్, బేబీ, వెల్దుర్తిలోని శేరీ వాడకు చెందిన మహేశ్వరీలకు వారం నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులు వీరికి చికిత్స నిర్వహించి పరీక్షలు చేయగా డెంగీ వ్యాధిగా గుర్తించారు. జిల్లా ఉన్నత స్థాయి వైద్యులు మండలంలో పర్యటించి డెంగీ నివారణకు పూర్తి స్థాయిలో చికిత్స నిర్వహించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.

 పాలమాకులలో విష జ్వరాలు
 నంగునూరు:  మండలంలోని పాలమాకులలో ఒకే కాలనీలో పలువురు విష జ్వరాల బారినపడ్డారు. 2వ వార్డుకు చెందిన భాగ్యలక్ష్మి, లలిత, మౌనిక, గీత, రమతో పాటు అదే వీధిలో ఉండే కలకుంట్ల రాజయ్య, శ్రీకాంత్, కనుకవ్వ, బొగ్గుల సాగర్‌లు మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. సిద్దిపేటలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరిని పరీక్షించిన వైద్యులు ప్లేట్‌లెట్స్ తగ్గాయని చెప్పడంతో అక్కడే చికిత్స చేయించుకుంటున్నారు. కాగా అదే కాలనీలో ఉండే మరో ఇద్దరు చిన్నారులకు డెంగీ సోకినట్లుగా అనుమానించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో చికిత్స చేయిస్తున్నారు.

 సిద్దిపేటలో మరో కేసు..
 సిద్దిపేట జోన్:  తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పదేళ్ల బాలుడికి శుక్రవారం డెంగీ సోకినట్లు వైద్యులు గుర్తించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. అంబేద్కర్‌నగర్‌కు చెందిన బొమ్మల బాల్‌నర్సు కుమారుడు పృథ్వికి మూడురోజులుగా తీవ్ర జ్వరంగా ఉంది. స్థానిక పిల్లల వైద్యునికి చూపించారు. బాలుడిని పరిశీలీంచిన వైద్యులు ప్లేట్‌లెట్స్ తగ్గినట్లుగా గుర్తించి హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు.

 బాలికకు డెంగీ లక్షణాలు
 దుబ్బాక:  ఎనగుర్తికి చెందిన పర్స భవాణి(11)కి డెంగీ లక్షణాలు బయటపడ్డాయి. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆ బాలికను ఈ నెల 11న నీలోఫర్ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి వైద్యులు డెంగీగా నిర్ధారించారని తల్లిదండ్రులు పర్స సుగుణ, శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతోం దన్నారు.

 దొమ్మాటలో డెంగీ?
 దౌల్తాబాద్: దొమ్మాటకు చెందిన బాలిక (13) తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మూడు రోజులుగా  జ్వరంతో బాధపడుతున్న బాలికను తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు బాలికను పరీక్షించిన అనంతరం రక్తంలో ప్లేట్‌లేట్‌ల సంఖ్య భారీగా తగ్గిపోయాయని, బాలికకు డెంగీ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ బాలిక కోలుకుంటున్నది.

 సంకాపూర్‌లో మరో ఇద్దరికి..
 చిన్నశంకరంపేట: సంకాపూర్‌లో మరో ఇద్దరికి డెంగీ లక్షణాలతో బాధపడుతున్నారు. శేఖర్, పర్సమల్లేశంలు డెంగీ వ్యాధితో బాధపడుతుండగా వారిని మెరుగైన చికిత్సకోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా సంకాపూర్‌లో  వైద్యశిబిరం కొనసాగుతోంది.   కాగా ఇప్పటి వరకు గ్రామంలో 5 మందికి డెంగీ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

మరిన్ని వార్తలు