మళ్లీ డెంగీ..

28 Sep, 2018 14:45 IST|Sakshi

ఇదే నెలలో 24 కేసులు నమోదు 

వేగంగా పెరుగుతున్న బాధితులు  

నిజామాబాద్‌ నగరం, బోధన్‌లోనే అత్యధికం

వేల్పూర్‌ మండలం పచ్చల నడ్కుడకు చెందిన సురేశ్‌ (పేరు మార్చాము)కు ఇటీవల డెంగీ జ్వరం సోకింది. ప్లేట్‌లెట్స్‌ ఆరువేలకు పడిపోయి ప్రమాదకర స్థితికి చేరాడు. ఆర్మూర్‌లోని ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందగా కోలుకుంటున్నాడు. ఇలా జిల్లాలో డెంగీ జ్వర పీడితులు పెరుగుతున్నారు. జూన్, జూలైలో డెంగీ నామమాత్రంగా ఉండగా ప్రస్తుతం తీవ్రమవుతోంది. ఇదే నెలలో ఆస్పత్రుల్లో 24 కేసులు నమోదు కావడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా డెంగీ ఉనికి వెలుగులోకి వస్తోంది. 

నిజామాబాద్‌అర్బన్‌ : జిల్లా వ్యాప్తంగా 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 59 డెంగీ కేసులు నమోదు అయ్యాయి.  ఇదే నెలలో 24 కేసులు నమోదు కావడం దీని తీవ్రతను తెలియజేస్తోంది. డెంగీ జ్వరంతో ఆస్పత్రులకు వెళుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా నిజామాబాద్‌ నగరంలో 32 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 15 కేసుల వరకు బోధన్‌ ప్రాంతంలో ఉన్నాయి. మిగితా కేసులు ఆయా ప్రాంతాల్లో నమోదు అయ్యాయి. గురువారం నిజామాబాద్‌లోని పూలాంగ్‌ ప్రాంతానికి చెందిన 12 సంవత్సరాల బాలుడికి డెంగీ సోకడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రికి తరలిం చారు. నవీపేట మండలం దర్యాపూర్‌ గ్రామానికి చెందిన రెండు సంవత్సరాల బాలిక డెంగీ సోకడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతోంది. బోధన్‌ పట్టణానికి చెందిన ఒకరు డెంగీ బారినపడ్డాడు. వీరు చికిత్స పొందుతున్నారు. డెంగీ కేసుల నమోదుతో వైద్య ఆరోగ్యశాఖ ఆందోళన చెందుతోంది. ఎక్కడైతే కేసు నమోదు అవుతుందో అక్కడ నివారణ చర్యలు చేపడుతున్నారు. చెడిపోయిన వస్తువులు, టైర్లు, కొబ్బరి చిప్పలు, ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండేచోట డెంగీ దోమ ఉత్పత్తి అవుతుంది. వాస్తవానికి జూన్‌లోనే ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామాల్లో మలేరియా శాఖ అవగాహన కల్పించి నీరు నిల్వ ఉండకుండా స్థానికులను అప్రమత్తం చేయాలి. దోమలు వృద్ధి కాకుండా నివారణ మందులు చల్లడం, ఫాగింగ్‌ చేయడం చేపట్టాలి. నివారణ చర్యలు చేపట్టక పోతే డెంగీ తీవ్రతకు కారణమవుతుందని అంటున్నారు. కంటి వెలుగు పథకంలో భాగంగా వైద్యసిబ్బంది శిబిరాలకు వెళ్లడంతో గ్రామాల్లో వ్యాధుల నియంత్రణ పడకేసింది. ప్రస్తుతం అధికారులు ప్రత్యేక  దృష్టిసారిస్తే వ్యాధులను నియంత్రించవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ముందస్తు జాగ్రత్తలే మేలు..
డెంగీ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా దోమలు పెరగకుండా, నీరు నిల్వ ఉండకుండా చూడాలి. డెంగీ బారిన పడితే ప్లేట్‌లేట్‌ సంఖ్య తగ్గిపోయి ప్రమాదం పొంచి ఉంటుంది. అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. 
డాక్టర్‌ తిరుపతిరావు, జనరల్‌ ఫిజీషియన్‌ 

నివారణ చర్యలు కొనసాగుతున్నాయి..
జిల్లాలో డెంగీ నివారణకు చర్యలు కొనసాగుతున్నాయి. అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడైతే వ్యాధి వెలుగులోకి వస్తుందో అక్కడ ప్రత్యేకంగా దృష్టిసారించి సర్వే చేపడుతున్నాం. ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి డెంగీ మరణాలు సంభవించలేదు.  
జిల్లా ఇన్‌చార్జి వైద్యాధికారి సుదర్శనం 

జనరల్‌ ఆస్పత్రిలో పెరిగిన ఓపీ
నిజామాబాద్‌అర్బన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో గురువారం అత్యధికంగా అవుట్‌ పేషెంట్లు నమోదు అయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓపీ పెరిగింది. 1491 మందికి ఆస్పత్రిలో అవుట్‌ పేషెంట్‌ సేవలు అందాయి. 158 మంది ఇన్‌పేషెంట్‌లుగా చేరారు. ఆస్పత్రిలో మొత్తం 500 పడకలు కాగా 608 పడకలతో ఇన్‌పేషెంట్‌ సేవలు అందుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున రోగులు రావడం మొదటిసారని ఆస్పత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ రాములు తెలిపారు. 

 

మరిన్ని వార్తలు