డెంగీ పంజా

23 Sep, 2018 11:16 IST|Sakshi
రోగులతో కిటకిటలాడుతున్న రిమ్స్‌

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో డెంగీ పంజా విసురుతోంది. ఏ ఊరిలో చూసినా జ్వరపీడితులే మంచంపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. చిన్నా పెద్ద, వృద్ధులు అనే తేడా లేకుండా డెంగీ, మలేరియా, వైరల్‌ జ్వరాలు, చికున్‌గున్యా, ఇతర జ్వరాలతో వణికిపోతున్నారు. వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఏజెన్సీ ప్రాంతంలోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆదిలాబాద్‌ పట్టణంతోపాటు ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, తదితర మండలాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వైరల్‌ జ్వరాలు సోకడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. రిమ్స్‌ ఆస్పత్రిలో పడకలన్ని నిండిపోయాయి. ఒక్కో బెడ్‌పై ఇద్దరు ముగ్గురేసి రోగులకు వైద్య చికిత్సలు అందించాల్సిన దుస్థితి నెలకొంది. వైద్య, ఆరోగ్య శాఖ వ్యాధులను అరికట్టాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో జ్వరాలు అదుపులోకి రావడం లేదు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం లేదని, దోమల నివారణకు చర్యలు చేపట్టడం లేదని పలువురు పేర్కొంటున్నారు.

వణికిస్తున్న జ్వరాలు
జిల్లాను జ్వరాలు వణికిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 20,289 మందికి వైరల్, ఇతర జ్వరాలు, ఐదుగురికి మలేరియా జ్వరాలు, 140 మందికి డెంగీ జ్వరాలు సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖాధికారులు లెక్కలు చూపుతున్నారు. అధికారుల లెక్కలకు రెట్టింపుగా జ్వరపీడితుల సంఖ్య ఉందని తెలుస్తోంది. రిమ్స్‌ ఆస్పత్రిలోని పిల్లల వార్డులో దాదాపు వంద మందికి పైగా డెంగీ జ్వరంతో చేరారు. ఇతర జ్వరాలతో కూడా పిల్లల వార్డు కిక్కిరిసిపోయింది. దీంతోపాటు రిమ్స్‌ జనరల్‌ వార్డులో మహిళలు, పురుషుల రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. రోగులకు సరిపడా పడకలు లేకపోవడంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. మలేరియా కేసులు బజార్‌హత్నూర్‌లో 1, సైద్‌పూర్‌లో 1, హస్నాపూర్‌లో 2, ఆదిలాబాద్‌ పట్టణంలోని న్యూహౌజింగ్‌బోర్డులో ఒకరికి మలేరియా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.

పారిశుధ్యమే కారణం..
ఆదిలాబాద్‌ పట్టణంలో డెంగీ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మిషన్‌ భగీరథ గుంతల్లో ఇటీవల కురిసిన వర్షపునీరు చేరడం, దోమలు వృద్ధి కావడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. మొదటి కేసు జిల్లాలో ఇంద్రవెల్లి మండలం సుక్యనాయక్‌తండా, ఉట్నూర్‌ మండలం అందునాయక్‌తండాల్లో నమోదైనట్లు వైద్యారోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. ఇంద్రవెల్లి, ఉట్నూర్‌లో డెంగీ బాధితులు అధికంగా ఉన్నారు. ముఖ్యంగా పారిశుధ్య సమస్యతోనే జ్వరాలు సోకుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఆస్పత్రులు కిటకిట..
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. రోజురోజుకు జ్వర బాధితుల సంఖ్య పెరుగుతుండడమే దీనికి కారణం. రిమ్స్‌లో రోగులకు సరిపడా బెడ్లు లేకపోవడంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్రజలు వైద్య సేవలు పొందుతున్నారు. ఇదే అదునుగా తీసుకొని ప్రైవేట్‌ ఆస్పత్రుల వారు అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. అవసరం లేకున్నా అన్ని పరీక్షలు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని రోగుల బంధువులు లబోదిబోమంటున్నారు. సరైన వైద్యం అందడంలేదనే కారణంతో ఎక్కువమంది వైద్య చికిత్సల కోసం మహారాష్ట్రలోని యావత్‌మాల్, నాగ్‌పూర్, తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు.

డెంగీతో ఒక్కరూ చనిపోలేదు
జిల్లాలో డెంగీ కేసులు ఉన్న మాట వాస్తవమే. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా డెంగీతో చనిపోయినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడి కాలేదు. జైనథ్‌ మండలంలో ఒక బాలుడు చనిపోయినట్లు తెలిసింది. వారిక్కడ వైద్య సేవలు పొందలేదు. వాటికి సంబంధించి రిపోర్టులు పరిశీలిస్తున్నాం. ముఖ్యంగా డెంగీ జ్వరం రావడానికి సానిటేషనే కారణం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కొబ్బరిచిప్పలు, పాత టైర్లు, వర్షపు నీరు నిల్వ ఉండే వాటిని తొలగించారు. వాటితోనే డెంగీ దోమలు వృద్ధి చెందుతాయి. దోమల నివారణ కోసం ఫాగింగ్‌ స్ప్రే చేయిస్తున్నాం. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. తీవ్ర జ్వరం వస్తే ఆర్‌ఎంపీలను సంప్రదించవద్దు. సమీప ఆస్పత్రిలో వైద్య చికిత్సలు తీసుకోవాలి. డెంగీ జ్వరం కోసం రిమ్స్‌లో ఎన్‌ఎస్‌–1 పరీక్షలు చేయడం జరుగుతుంది. నాలుగు రోజులపాటు తగ్గకుంటే ఐజీఎం పరీక్ష కూడా చేయడం జరుగుతుంది. – డాక్టర్‌ రాజీవ్‌రాజ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఆదిలాబాద్‌

మరిన్ని వార్తలు