డెంగీ.. డేంజర్‌

15 Jul, 2019 12:30 IST|Sakshi

45 రోజుల్లో 50కి పైగా డెంగీ కేసులు

గ్రేటర్‌లో మళ్లీ దోమల పంజా

ఆస్పత్రులకు పోటెత్తుతున్న రోగులు

ఆందోళనలో బస్తీవాసులు..

పట్టించుకోని అధికారులు

సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం వర్షాలు కూడా లేవు. ఇంటి ఆవరణలోని పూల కుండీలు, వాటర్‌ ట్యాంకులు, ఇంటిపై ఉన్న టైర్లు, ఖాళీ కొబ్బరి బోండాలు, ప్లాస్టిక్‌ డబ్బాల్లోనూ నీరు లేదు. కానీ డెంగీ దోమలు మాత్రం విజృంభిస్తున్నాయి. బస్తీలు, కాలనీలు, శివార్లు అనే తేడా లేకుండా ఇటీవల ఆయా ప్రాంతాల్లో కొత్తగా అనేక బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. వీటి కింద ఉన్న నీళ్ల ట్యాంకులపై మూతలు లేకపోవడం, క్యూరింగ్‌ కోసం వాడిన నీరు రోజుల తరబడి నిల్వఉంచుతుంటంతో అవి డెంగీ(టైగర్‌)దోమలకు నిలయంగా మారుతున్నాయి. ఆ పక్కనే ఉన్న సిటిజన్లపై పగటిపూట తమ పంజా విసురుతున్నాయి. ఫలితంగా ఒక్క హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోనే కేవలం 45 రోజుల్లో 50కి పైగా కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారిక లెక్కల ప్రకారమే ఇన్ని కేసులు నమోదైతే... అనధికారికంగా మరింత మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. 

30 వేలకుపైగా డయేరియా కేసులు
ఇటీవల వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఆహారం, మంచినీరు కలుషితమవుతోంది. ఇవి తీసుకోవడం వల్ల అనేక మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జూన్‌ చివరి నాటికి 1.50 లక్షల మంది డయేరి యా బారిన పడగా, వీటిలో హైదరాబాద్‌లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 2018లో 71,918 డయేరియా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 30 వేలకుపైగా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే ఇటీవల బోరబండ గురుకుల పాఠశాల విద్యార్థులు సహా నాంపల్లి పాలిటెక్నిక్‌ కాలేజీకి చెందిన సుమారు 30 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తీసుకుని వాంతులు, విరేచనాలతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరగా, తాజాగా విజయనగర్‌ కాలనీ మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిను 33 మంది విద్యార్థులు ఇదే కారణంతో నిలోఫర్‌లో చేరగా.. బాధిత చిన్నారులకు వైద్యులు చికిత్స చేసి పంపించారు. 

ఫీవర్‌కు పొటెత్తుతున్న జ్వరపీడితులు
తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 21776 టైఫాయిడ్‌ జ్వరాలు నమోదు కాగా, వీరిలో 1400 మంది బాధితులు గ్రేటర్‌వాసులే కావడం విశేషం. సాధారణంగా ‘సాల్మోనెల్లా టైఫి’ అనే బ్యాక్టీరియా కలిసిన నీటిని తాగడం వల్ల టైఫాయిడ్‌ జ్వరం వస్తుంది. జర్వంతో మొదలై...అలసట, తలనొప్పి, అధిక జ్వరం, కడుపునొప్పి, మలబద్దకం, వికారం, ఛాతిపై గులాబీరంగు మచ్చలు వంటి లక్షణాలతో బాధపడుతూ.. ఆస్పత్రుల్లో చేరుతున్నారు. సాధారణ జ్వర పీడితులకు సత్వర వైద్యసేవలు అందించేందుకు నగరంలో 85 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, వందకుపైగా బస్తీదావాఖానా లు ఉన్నాయి. ఆయా ఆరోగ్య కేంద్రా ల్లో మెడికల్‌ ఆఫీసర్లు, మౌళిక సదుపాయాలు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. ఫలితంగా చికిత్స కోసం బాధితులు నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా బస్తీల్లో పర్యటించి సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన జీహెచ్‌ఎంసీ అధికారులు, ప్రజారోగ్యశాఖ సిబ్బంది తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణం. 

డెంగీకి కారణం ఇదే..
ఈడిన్‌ ఈజిఫ్టై(టైగర్‌ దోమ) కుట్టడం ద్వారా డెంగీ సోకుతుంది. ఇది పగటి పూట మాత్రమే కుడుతుంది. దోమ కుట్టిన 78 రోజులకు హఠాత్తుగా తీవ్రమైన జ్వరం వస్తుంది. కాళ్లు కదలించలేని పరిస్థితి ఉంటుంది. ఎముకలు, కండరాల్లో భరించలేని నొప్పి, శరీరంపై ఎర్రటి పొక్కులు వస్తాయి. రక్త కణాలు(ప్లేట్స్‌ లెట్స్‌) సంఖ్య పడిపోతుంది. కొన్నిసార్లు అవయవాలన్నీ పనిచేయడం మానేస్తాయి. లక్షణాలు గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల డెంగీ నుంచి బయ టపడొచ్చు. మంచినీటి ట్యాంకులపై మూతలు పెట్టడం, చెట్లపొదలను శుభ్రం చేయడం, పూల కుండీల్లో నీటినిల్వ లేకుండా చేయడం ద్వారా డెంగీ దోమలను దరి చేరకుండా చూడొచ్చు.   – డాక్టర్‌ సందీప్‌రెడ్డి, జనరల్‌ ఫిజీషియన్‌

నీటి కలుషితం వల్లే డయేరియా
నగరానికి చెరువుల నుంచి నీరు సరఫరా అవుతుంది. ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల్లో నీరు దగ్గరపడటం, ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరదనీరు వెళ్లి చెరువుల్లో చేరుతుండటం వల్ల నీరు కలుషితమవుతుంది. దీనికి తోడు కుళ్లిన పదార్థాలతో ఆహారం వండటం, తెలియక దీన్ని తినడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ డయేరియా కేసులు ఎక్కువ నమోదు కావడానికి ఇదే ప్రధాన కారణం. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మల, మూత్ర విసర్జన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం, వేడివేడి ఆహారం తీసుకోవడం, కాచి వడపోసిన నీటిని తాగడం ద్వారా డయేరియా, టైఫాయిడ్‌ వంటి వ్యాధుల బారినుంచి బయటపడొచ్చు.– డాక్టర్‌ హరిచరణ్, జనరల్‌ ఫిజీషియన్‌  

మరిన్ని వార్తలు