ఆ కుటుంబానికి మరో షాక్‌

1 Nov, 2019 16:14 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల : డెంగీ విషజ్వరం ఇప్పటికే ఆ కుటుంబంలో నలుగురిని బలి తీసుకోంది. పదిహేను రోజుల వ్యవధిలో ఆ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు డెంగీ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదాన్ని జీర్ణించుకోకముందే.. ఆ కుటుంటానికి మరో షాక్‌ తగిలింది. రెండు రోజుల క్రితం జన్మించిన బాబు కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా కేంద్రం శ్రీశ్రీనగర్‌లో నివాసం ఉంటున్న గుడిమల్ల రాజగట్టు, సోని దంపతుల కుటుంబంలో డెంగీ విషాదాన్ని మిగిల్చింది. తొలుత రాజగట్టు, ఆ తర్వాత అతని తాత లింగయ్య డెంగీ బారిన పడి మృతి చెందారు. 

వీరి మృతిని జీర్ణించుకోకముందే రాజగట్టు, సోని దంపతుల కుమార్తె శ్రీవర్షిణి (6)కి డెంగీ జ్వరం వచ్చింది. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత నెల 27న దీపావళిరోజు మృతి చెందింది. అప్పటికే సోనీకి నెలలు నిండటం.. ఆమెకు కూడా డెంగీ లక్షణాలున్నాయని వైద్యులు నిర్ధారించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం సోనిని గత నెల 28న సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చేర్చారు. మంగళవారం మధ్యాహ్నం సిజేరియన్‌ ద్వారా సోని మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు కూడా డెంగీ సోకడంతో ఐసీయూ ఉంచి తల్లీ బిడ్డలకు చికిత్సను అందజేశారు. అయితే బుధవారం మధ్యాహ్నం తల్లి సోని మృతి చెందింది. 

దీంతో సోనికి జన్మించిన శిశువును ప్రస్తుతం మంచిర్యాలలోని మహాలక్ష్మి ఆస్పత్రిలో అబ్జర్వేషన్‌లో ఉంచారు. అయితే ప్రస్తుతం ఆ శిశువుకు రక్తకణాలు తగ్గినట్టు వైద్యులు గుర్తించారు. బాబు పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన వైద్యులు రాజగట్టు తల్లిదండ్రులను, అతని పెద్దకొడుకు శ్రీవికాస్‌ను(8) ఆస్పత్రికి పిలిపించారు. వారి రక్త నమునాలను సేకరించి డెంగీ నిర్ధారణ పరీక్షలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

చదవండి : డెంగీతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

మరిన్ని వార్తలు