ఎయిడ్స్‌ రోగికి వైద్యం నిరాకరణ!

2 Feb, 2017 03:14 IST|Sakshi
ఎయిడ్స్‌ రోగికి వైద్యం నిరాకరణ!

► ఆశ్రయం ఇవ్వడానికి బంధువుల నిరాకరణ
► స్థానికుల చొరవతో ఆస్పత్రికి..

మహబూబాబాద్‌: జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి వైద్యులు ఓ రోగికి వైద్యం చేసేందుకు నిరాకరించారు. ఇటు బంధువులూ.. అద్దె ఇంటి వారు దగ్గరకు రానివ్వలేదు. తొర్రూ రు మండలంలోని కంఠాయపాలెం కు చెందిన మహ్మద్‌ పాషా, రజి యాలకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పాషా సుతారీ మేస్త్రీ. ఈ కుటుంబం జిల్లా కేంద్రంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటోంది. రజియాకు హెచ్‌ఐవీ ఉన్నట్లు వరంగల్‌ ఎంజీ ఎం వైద్యులు నిర్ధారించారు. 15 రోజుల క్రితం మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా, హెచ్‌ఐవీతోపాటు టీబీ కూడా ఉందని చెప్పారు.. దీంతో ఆమెను హన్మకొండ భీమారంలో టీబీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వారు పట్టించుకోలేదు.

దీంతో  ఆ కుటుంబం అద్దె ఇంటికి తిరిగి  వచ్చింది. అయితే, అద్దె ఇంటి యజమాని రజియా వ్యాధిగురించి తెలిసి ఇంటికి రానివ్వలేదు. ఈ క్రమంలో మంగళవారం మళ్లీ మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు అడ్మిట్‌ చేసుకోమని చెప్పారు. స్వగ్రామంలోని సోదరుడి ఇంటికి వెళ్లినా.. ఆశ్రయం లభించలేదు. తిరిగి మహబూబాబాద్‌కు వచ్చిన పాషా పట్టణ శివారులో రోడ్డు పక్కన రజియాను పడుకోబెట్టాడు. రాత్రంతా తన పిల్లలతో జాగరణ చేశాడు. దీంతో స్థానికులు 108 సమాచారం అందించి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు రజి యాను అడ్మిట్‌ చేసుకున్నారు. జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనిని వచ్చి వివరాలు సేకరించారు.

మరిన్ని వార్తలు