చిన్నారుల్లో దంత సమస్యలు అధికం

2 Jun, 2018 02:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బడి పిల్లల అనారోగ్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని పిల్లల్లో 10 శాతం మంది ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువ మందిని దంత సమస్యలు వేధిస్తున్నాయి. దృష్టి లోపం, రక్తహీనతతో బాధపడే పాఠశాలల పిల్లల సంఖ్యా ఎక్కువగానే ఉంది.

రాష్ట్రీయ బాలల ఆరోగ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్‌బీఎస్‌కే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. వైద్య–ఆరోగ్య శాఖ, విద్యాశాఖ రాష్ట్రంలోని అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఆరో గ్య పరీక్షలు నిర్వహించాయి. ఆ వివరాలను వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది.  

అనారోగ్యం బారిన 1.72 లక్షల చిన్నారులు
రాష్ట్రంలోని 31 జిల్లాల్లో కలిపి మొత్తం 22,36,417 మంది పరీక్షలు నిర్వహించారు. వీరిలో 12,59,983 మంది బాలికలు, 9,76,434 మంది బాలురు ఉన్నారు. ఆర్‌బీఎస్‌కేలో భాగంగా 40 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య బృందాలు పరీక్షలు నిర్వహించిన వారిలో 1,72,007 మందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా 18,607 మంది పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.

ఖమ్మం జిల్లాలో 17,122, హైదరాబాద్‌లో 12,471 మంది పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సమస్యలున్న పిల్లలను పరిశీలిస్తే ఎక్కువగా 43,378 మంది దంత సమస్యలతో బాధపడుతున్నారు. దృష్టి లోపాలతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య 22,670 ఉంది. 10,081 మంది రక్తహీనత సమస్య ఉంది. వయస్సు కంటే తక్కువ బరువు ఉన్న వారు 5,071 మంది, అతి తక్కువ బరువు ఉన్న వారు 4,662 మంది ఉన్నారు. చర్మ వ్యాధులతో ఉన్న పిల్లల సంఖ్య 16,094గా ఉంది.

మరిన్ని వార్తలు