గులాబీ పురుగును బుట్టలో వేయరా?

4 Sep, 2018 02:04 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా పత్తి చేలపై గులాబీ పురుగు పంజా

పట్టించుకోని వ్యవసాయశాఖ.. ఈసారీ దిగుబడిపై ప్రభావం  

ఇప్పటికీ లింగాకర్షక బుట్టలను సరఫరా చేయని వైనం

పత్తి సాగు 44.30 లక్షల ఎకరాలు.. 2 లక్షల బుట్టలకే ఆర్డర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పత్తి పంటను గులాబీ రంగు పురుగు పట్టి పీడిస్తున్నా వ్యవసాయశాఖ పట్టించుకోవడం లేదు. నియంత్రణ చర్యలు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. గులాబీ పురుగును గుర్తించి నియంత్రించడానికి లింగాకర్షక బుట్టలను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు లింగాకర్షక బుట్టలను రైతులకు సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో గులాబీ రంగు పురుగు పత్తి చేలలో విజృంభిస్తోంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, ఈసారి అంచనాలకు మించి 44.30 లక్షల (105%) ఎకరాల్లో సాగైంది.  

గత నెలలోనే దాడి ప్రారంభం..
గత నెల్లోనే పత్తిపై గులాబీ పురుగు దాడి ప్రారంభమైందని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, నల్లగొండ, నిర్మల్, ఆసిఫాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పెద్ద ఎత్తున పత్తిని పీడిస్తున్నట్లు అంచనా వేశాయి. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ దీని జాడలున్నట్లు గుర్తిం చాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఏడెనిమిది లక్షల ఎకరాల్లో గులాబీ రంగు పురుగు విస్తరించి ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి. అయితే దాన్ని నియంత్రించడంలో మాత్రం నామ మాత్రపు చర్యలకే పరిమితమయ్యాయి.  

25 వేల ఎకరాలకే బుట్టలు..
గులాబీ రంగు పురుగును గుర్తించడానికి లింగాకర్షక బుట్టలను వాడాల్సి ఉంటుంది. అయితే వీటిని కేవలం తొమ్మిది జిల్లాల్లో 25 వేల ఎకరాలకే సరఫరా చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. అందుకు ప్రతిపాదనలు సైతం తయారుచేసింది. దాదాపు ఏడెనిమిది లక్షల ఎకరాల వరకు పురుగు సోకిందని అంచనా వేసినా అధికారులు కేవలం 25 వేల ఎకరాలకే లింగాకర్షక బుట్టలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి.

వాస్తవంగా ఒక్కో ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను వాడాలి. ఆ ప్రకారం 25 వేల ఎకరాలకు 2 లక్షల లింగాకర్షక బుట్టలను మాత్రమే వ్యవసాయశాఖ ఆర్డర్‌ చేసింది. ఇదిలాఉంటే మరో వైపు గులాబీ పురుగు ఇంతింతై విస్తరిస్తోంది. ఇప్పటికే బుట్టలు అమర్చాల్సి ఉన్నా వ్యవసాయశాఖ ఆర్డర్లకే పరిమితమైంది. అవెప్పుడు అందుబాటులోకి వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉంది.

రైతుల్లో ఆందోళన..
కొన్ని చోట్ల గులాబీ పురుగు కారణంగా రైతులు పత్తి మొక్కలను పీకేస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఏడాదికేడాదికి గులాబీ పురుగు ఉధృతి పెరుగుతోంది. వ్యవసాయశాఖ దీన్ని ప్రాధాన్య అంశంగా గుర్తించి గులాబీ పురుగుపై యుద్ధం చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కానీ వ్యవసాయశాఖ ఆ మేరకు ఏర్పాట్లు చేయడం లేదు. గతేడాది గులాబీ పురుగు కారణంగా పెద్ద ఎత్తున దిగుబడులు తగ్గిపోయాయి.

ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 5–6 క్వింటాళ్ల మేర తగ్గింది. గతేడాది 3.30 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేయగా, 2 కోట్ల క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. సాగు ఎంత పెరిగినా గులాబీ పురుగు నుంచి రక్షణ కల్పించకుంటే తమ శ్రమంతా వృథాయేనని రైతులు వాపోతున్నారు. లాభాలు దేవుడెరుగు నష్టాలతో అప్పులే మిగులుతాయని ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు