చేతిలో బీఈడీ.. చెల్లని పట్టా

9 Dec, 2017 03:10 IST|Sakshi

టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోలేక బీఎడ్‌ అభ్యర్థుల ఆవేదన 

నోటిఫికేషన్‌లో విద్యాశాఖ నిబంధనలే కారణం

అశోక్‌... టీచర్‌ కొలువు సాధించాలన్న పట్టుదలతో బీఈడీ చేశాడు. కానీ డిగ్రీలో నిర్ణీత మార్కులు(50%) ఉండాలన్న నిబంధనతో టీచర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోయాడు. చేసేదిలేక నిరాశలో కూరుకుపోయి తన బీఎడ్‌ సర్టిఫికెట్‌ను ఫేస్‌బుక్‌లో ఇలా అమ్మకానికి పెట్టాడు.

స్వాతి.. టీచర్‌ కావాలన్న ఆశతో అప్పులు చేసి మరీ నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుంది. ఈమెది అదే సమస్య. డిగ్రీలో నిర్ణీత మార్కులు లేకపోవడంతో దరఖాస్తుకు కూడా దూరమైంది. తీవ్ర ఆవేదనతో ఊరెళ్లిపోయింది.


సాక్షి, హైదరాబాద్‌ : ..ఇలా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) చేసి, ఉపాధ్యాయ అర్హత పరీక్షలో (టెట్‌) అర్హత సాధించిన వేలాది మంది అభ్యర్థులు ఇంటిబాట పట్టారు!! ఉద్యోగం మాట దేవుడెరుగు.. కనీసం టీచర్‌ పోస్టు కోసం దర ఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేక కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. హైదరాబాద్‌కు వచ్చి కోచింగ్‌లు తీసుకున్నవారంతా ప్రస్తుత నిబంధనలతో ఆవేదన చెందుతున్నారు.

8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే వీల్లేకుండా చేసి తమను విద్యాశాఖ రోడ్డు పాల్జేసిందని వాపోతున్నారు. రాష్ట్రంలో బీఎడ్‌ పూర్తి చేసినవారు 3.5 లక్షల మంది ఉంటే.. అందులో వేలాది మంది ఇలా టీచర్‌ పోస్టులకు అర్హత లేక ఆందోళన చెందుతున్నారు. 2012 తర్వాత ఇన్నాళ్లకు ఇచ్చిన అవకాశాన్ని నిబంధనల పేరిట దూరం చేస్తున్నారని అభ్యర్థులు  వాపోతున్నారు.


విద్యాశాఖ నిబంధనలివీ..
ఆరు నుంచి పదో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే జనరల్‌ అభ్యర్థి బీఎడ్‌ చేసి, టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. డిగ్రీలో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాల్సిందే. బీసీ, ఎస్సీ, ఎస్టీలైతే డిగ్రీలో 45% మార్కులు సాధించాలి. అలా ఉంటేనే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. విద్యాశాఖ రూపొందించిన ఈ నిబంధనలు అభ్యర్థుల పాలిట శాపంగా మారాయి. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనల మేరకే ఈ రూల్స్‌ రూపొందించామని చెబుతున్న విద్యాశాఖ.. అవే ఎన్‌సీటీఈ నిబంధనల్లో ఇతర అంశాలను విస్మరించింది.

ఎన్‌సీటీఈ ఏం చెబుతోంది..?
ఉపాధ్యాయులకు ఉండాల్సిన కనీస అర్హతలను ఎన్‌సీటీఈ నిర్ణయిస్తుంది. 2001, 2002, 2007, 2010, 2014లో అర్హతలను ప్రకటించింది. 2014లో ప్రకటించిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఎస్‌జీటీ పోస్టులకు (1 నుంచి 5 వరకు బోధించేవారు) జనరల్‌ అభ్యర్థులు ఇంటర్‌లో 50% (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 %) మార్కులుండాలి. డీఎడ్‌ చేసి ఉండాలి. టెట్‌లో అర్హత సాధించాలి. లేదా డీఎడ్‌లో చేరేందుకు 2002, 2007లో జారీ చేసిన ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం.. ఇంటర్‌లో జనరల్‌ అభ్యర్థులకు 45% మార్కులున్నా సరిపోతుంది.

ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతం మార్కులున్నా చాలు. వాటితోపాటు డీఎడ్‌ చేసి ఉండాలి. టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. 6,7,8,9,10 తరగతులకు బోధించే స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే జనరల్‌ అభ్యర్థులకు డిగ్రీ/పీజీలో 50 శాతం(ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 శాతం) మార్కులు ఉండాలి. అలాగే బీఎడ్‌తోపాటు టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. లేదా బీఎడ్‌లో చేరేందుకు 2002, 2007లో ఎన్‌సీటీఈ జారీ చేసిన నిబంధనల ప్రకారం.. డిగ్రీలో జనరల్‌ అభ్యర్థులకు 45% మార్కులుంటే చాళు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40% మార్కులున్నా చాలు. లేదా 6,7,8 క్లాసుల టీచర్లకు రెండేళ్ల బీఎడ్‌తోపాటు డిగ్రీలో నిర్ణీత మార్కులు సాధించి ఉండాలి.


నిబంధనలు బేఖాతరు
2014 నవంబర్‌ 12న ఎన్‌సీటీఈ జారీ చేసిన ‘ఎన్‌సీటీఈ (డిటర్మినేషన్‌ ఆఫ్‌ మినిమమ్‌ క్వాలిఫికేషన్‌ ఫర్‌ పర్సన్స్‌ టు బి రిక్రూటెడ్‌ యాజ్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌) రెగ్యులేషన్స్‌లోని అన్ని నిబంధనలను పరిగణన లోకి తీసుకోకుండానే విద్యాశాఖ అర్హతలను నిర్ణయించింది. దీంతో చాలామంది టీచరు పోస్టులకు అనర్హులవుతున్నారు.

డిగ్రీలో 50% మార్కులు (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 శాతం) లేవన్న సాకుతో వేల మంది అభ్యర్థులకు అర్హత లేకుండా పోయింది. డిగ్రీ చదివి, రెండేళ్ల డీఎడ్‌ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు 6, 7, 8 తరగతులకు బోధించే అవకాశం కల్పించాలని ఎన్‌సీటీఈ నిబంధనలు న్నాయి. కానీ 6, 7, 8 తరగతులకు బోధించే టీచర్ల విషయంలో డిగ్రీ, డీఎడ్‌ వారికి విద్యాశాఖ అవకాశం ఇవ్వలేదు. పీజీలో 50% మార్కులు వచ్చినా దరఖాస్తుకు అవకాశం ఇవ్వడం లేదు.

ఈ ప్రశ్నలకు బదులేదీ?
ఎన్‌సీటీఈ జారీ చేసిన నిబంధనల్లో డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలని పేర్కొన్న నిబంధన ఇప్పుడు కొత్తగా తెచ్చిందేమీ కాదు. 2010 ఆగస్టు 23న జారీ చేసిన ఎన్‌సీటీఈ మార్గదర్శకాల్లోనూ ఉంది. అలాగే 45 శాతం మార్కుల నిబంధన కూడా ఉంది. 2002లో జారీ చేసిన ఎన్‌సీటీఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. అంటే 2002 నుంచి 50 శాతం మార్కుల నిబంధన ఉందని అనుకుందాం.. మరి అప్పుడే అభ్యర్థులు బీఎడ్‌లో చేరేప్పుడు 50 శాతం మార్కులు లేవు కాబట్టి మీకు ప్రవేశం కల్పించబోమని విద్యాశాఖ ఎందుకు ప్రకటించలేదు.

పైగా 50 శాతం మార్కులు లేకుండానే బీఎడ్‌ పూర్తి చేసిన వారికి 2010లో టెట్‌ అమల్లోకి వచ్చాక టెట్‌కు హాజరయ్యేందుకు ఎందుకు అనుమతి ఇచ్చారు? అన్నది అధికారులే చెప్పాలి. డిగ్రీ లేదా పీజీలో 50 శాతం మార్కులున్నా సరిపోతుందన్నారు. నిబంధనల ప్రకారం డిగ్రీలో 50 శాతం లేదని తిరస్కరిస్తున్నారు సరే.. మరి పీజీలో 50 శాతం కంటే ఎక్కువ మార్కులున్నా ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు