వేతనాలిచ్చిన సంస్థలకే రాయితీ! 

21 Apr, 2020 02:15 IST|Sakshi

పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం అమలుపై యంత్రాంగం దృష్టి 

కేంద్ర కార్మిక శాఖ స్పష్టీకరణ 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం అమలుపై కార్మిక శాఖ దృష్టి సారించింది. గత నెల 24 నుంచి కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించింది. వచ్చే నెల 3 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో వందలోపు కార్మికులున్న ఉద్యోగులకు ఈపీఎఫ్‌ చందా ను ప్రభుత్వం భరించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కార్మిక శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఉద్యోగులకు నెలవారీ వేతనం చెల్లించిన సంస్థలే ఈపీఎఫ్‌ రాయితీలను పొందే వీలుంటుందని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. 

ఈసీఆర్‌ జనరేట్‌ చేయాల్సిందే.. 
వందలోపు ఉద్యోగులుండి అందులో 90 శాతం మంది వేతనాలు 15 వేల లోపు ఉన్న సంస్థలకే ఈపీఎఫ్‌ రాయితీ వర్తిస్తుంది. ఇలాంటి కంపెనీలోని ఉద్యోగుల వేతనం ప్రకారం.. కంపెనీ వాటా12%తో పాటు ప్రభుత్వం చెల్లించే వాటా 12% కలుపుకుని మొత్తం 24% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉద్యోగులకు నెలవారీ వేతనం చెల్లించిన తర్వాత ఈపీఎఫ్‌ చందాను ఆన్‌లైన్‌ పద్ధతిలో చెల్లించిన తర్వాత ఈసీఆర్‌ (ఎలక్ట్రానిక్‌ చలాన్‌ కమ్‌ రిటర్న్‌)ను కార్మిక శాఖకు, ఈపీఎఫ్‌ఓకు సమర్పిస్తుం ది. తాజాగా రాయితీ పొందే సంస్థలు వేతనాల ను చెల్లించి ఆ వివరాలను కార్మిక శాఖకు సమర్పించాలి. అలా ఈసీఆర్‌లను సమర్పించిన తర్వా త కార్మిక శాఖ అధికారులు వాటిని పరిశీలించి ఉద్యోగుల ఈపీఎఫ్‌ చందాను వారి యూఏఎన్‌ నంబర్‌కు బదిలీ చేస్తారు. ఈ క్రమంలో రాయితీ పొందే ప్రతి కంపెనీ ఉద్యోగి పూర్తి వేతనాలను సక్రమంగా చెల్లించాల్సిందే. 

వేతనంతో కూడిన సెలవులు.. 
లాక్‌డౌన్‌ కాలంలో ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేసింది. ఈ సమయంలో ఉద్యోగులు విధులకు హాజరు కానప్పటికీ వేతనాలు చెల్లించాలి. కొన్ని కంపెనీలు పనిచేసిన కాలానికే వేతనాలు ఇస్తున్నట్లు కార్మిక శాఖ దృష్టికి వచ్చింది. వీటిపై కార్మికులు లేదా ఉద్యోగులు కార్మిక శాఖను సంప్రదించి ఫిర్యాదు చేస్తే కార్మిక చట్టాల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు