వ్యవసాయ శాఖలో ఉద్యోగుల సమ్మె

20 Aug, 2016 02:14 IST|Sakshi

22న ప్రభుత్వానికి నోటీసు ఇవ్వాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ శాఖలో డైరెక్టర్‌కు, ఉద్యోగులకు మధ్య మళ్లీ వివాదం రగులుకుంది. ఇటీవల ఆ శాఖ డైరెక్టర్‌ ప్రియదర్శినికి, డిప్యూటీ డైరెక్టర్‌ రాములుకు మధ్య కొద్దిపాటి ఘర్షణ జరిగినట్లు తెలిసింది. దీంతో ప్రియదర్శిని పోలీసు కేసు వరకు వెళ్లినట్లు సమాచారం. ఇలా ఆ శాఖలో ఆమెకు, ఉద్యోగులకు మధ్య తరచు ఘర్షణ వాతావరణం నెలకొంటోందన్న విమర్శలున్నాయి. డైరెక్టర్‌ తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గతంలో ఆందోళన చేశామని, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, అయినా డైరెక్టర్‌ వైఖరిలో మార్పు రాలేదని, ప్రభుత్వం కూడా స్పందించలేదని ఉద్యోగులు చెబుతున్నారు.

డైరెక్టర్‌ వైఖరికి నిరసనగా సమ్మె చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ అగ్రి డాక్టర్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రాములు తెలిపారు. ఈనెల 22న సమ్మె నోటీసు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించామని, మిగతా సంఘాలతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. కీలక సమయంలో రైతులను పట్టించుకోవడం మానేసి, ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సమ్మెను జిల్లాలకు కూడా వ్యాపింపజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉద్యోగులంతా సమ్మె నిర్వహించి డైరెక్టర్‌పై చర్యకు డిమాండ్‌ చేయాలని నిర్ణయించామన్నారు. దీనిపై మంత్రి పోచారంను కలసి విన్నవించనున్నామని తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు