స్కూళ్లను బట్టి కేటగిరీలుగా జిల్లాలు!

24 Sep, 2016 03:05 IST|Sakshi

- ‘ఏ’, ‘బీ’లుగా విభజన...డీఈవోలంతా ‘ఏ’ కేటగిరీల్లోనే..
- ఇన్‌చార్జి డీఈవోలుగా..డిప్యూటీ ఈవో, ఏడీలు
- కసరత్తు పూర్తి చేసిన విద్యాశాఖ
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాత జిల్లాలతోపాటు త్వరలో ఏర్పాటు కానున్న కొత్త జిల్లాలను విద్యాశాఖ ఏ, బీ కేటగిరీలుగా విభజించింది. స్కూళ్ల సంఖ్య, విద్యార్థుల సంఖ్య, అకడమిక్ మానిటరింగ్ పారామీటర్ తదితర అంశాల ఆధారంగా 27 జిల్లాలను రెండు కేటగిరీలుగా విభజించింది. ‘ఏ’ కేటగిరీలో 9 జిల్లాలను చేర్చింది. అందులో రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, హన్మకొండ, హైదరాబాద్, కొమురంభీమ్ జిల్లాలు ఉన్నాయి. వాటిల్లో ప్రస్తుతం పని చేస్తున్న డీఈవోలనే (డిప్యూటీ డెరైక్టర్ కేడర్) జిల్లా విద్యా శాఖ అధికారులుగా కొనసాగించనుంది. మిగతా 18 జిల్లాలను ‘బీ’ కేటగిరీలో చేర్చింది. అందులో ఆదిలాబాద్, సంగారెడ్డి, కొత్తగూడెం, నిర్మల్, శంషాబాద్, మల్కాజిగిరి, జగిత్యాల, పెద్దపల్లి, వనపర్తి, నాగర్‌కర్నూల్, సిద్ధిపేట్, మెదక్, సూర్యాపేట, యాదాద్రి, కామారెడ్డి, వరంగల్ , భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి.

ఆయా జిల్లాలకు డీఈవోలుగా కొత్తవారిని నియమించనుంది. ప్రస్తుతం డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లుగా పని చేస్తున్న 11 మంది, నలుగురు అసిస్టెంట్ డెరైక్టర్లను, ఎస్‌సీఈఆర్‌టీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్‌ఈ), కాలే జ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్‌కు (సీటీఈ) చెందిన ముగ్గురిని ‘బీ’ కేటగిరీ జిల్లాల్లో ఇన్‌చార్జీ డీఈవోలుగా నియమించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. అంతేకాదు ఆయా జిల్లాల్లో అందించాల్సిన సేవలు, అవసరాల మేరకు ఏయే జిల్లాలు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సినవి, ఏయే జిల్లాలు మధ్యతరహాలో ఉండేవి, ఏయే జిల్లాలకు తక్కువ ప్రాధాన్యం ఉంటుందన్న అంచనాలతో లెక్కలు వేసింది. ఐదు ప్రధాన అంశాల అధారంగా వీటిని నిర్ధారించింది. ఇందులో ఒకటో పారామీటర్‌లో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లు ఉన్న వాటిని పరిగణలోకి తీసుకుంది. రెండో పారామీటర్ కింద ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలోని విద్యార్థులను తీసుకుంది. మూడో పారామీటర్‌గా ప్రైవేటు పాఠశాలలు, నాలుగో పారామీటర్‌గా బడిబయటి పిల్లల సంఖ్య, ఐదో పారామీటర్‌గా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను పరిగణనలోకి తీసుకొని జిల్లాలను ప్రాధాన్యాల కేటగిరీలో చేర్చింది.

 ఇవీ జిల్లాల వారీగా ప్రాధాన్యాలు
 అధిక ప్రాధాన్యం: పెద్దపల్లి, భూపాలపల్లి (జయశంకర్), మెదక్, జగిత్యాల, మహబూబాబాద్, యాదాద్రి, వరంగల్, హన్మకొండ, నిర్మల్.
 మధ్యస్థ ప్రాధాన్యం: సిద్ధిపేట్, కామారెడ్డి, కరీంనగర్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, రంగారెడ్డి, కొత్తగూడెం, మల్కాజిగిరి, నిజమాబాద్.
 తక్కువ ప్రాధాన్యం: సంగారెడ్డి, ఆదిలాబాద్, ఖమ్మం, శంషాబాద్, కొమురంభీమ్, నల్లగొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, హైదరాబాద్.

మరిన్ని వార్తలు