ఇరకాటంలో విద్యాశాఖ?

3 Aug, 2015 01:51 IST|Sakshi
ఇరకాటంలో విద్యాశాఖ?

సంగారెడ్డి మున్సిపాలిటీ : జిల్లా విద్యాశాఖ ఇరకాటంలో పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉపాధ్యాయుల బదిలీలలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో విద్యాశాఖ ఉన్నత అధికారులు విచారణ చేపట్టారు. అ వివాదం ముగియకుండానే మరో వివాదం తెరపైకివచ్చింది. ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి సిరిబాబు ఒంటికి నిప్పంటించుకున్నారు. దీంతో విద్యార్థి సంఘలతో పాటు బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. డీఈవో తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ  శనివారం బీసి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ క్రమంలో పాఠశాలల యాజమాన్యాలు స్పదించకపోవడంతో ఆగ్రహానికిలోనైన సిరిబాబు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటీపై పోసికొని నిప్పు అంటించుకున్నాడు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తత దారి తీసింది. ఇందుకు జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రధానకారణమని నాయకులు ఆరోపించారు. పలుమార్లు ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.

 ఫీజుల నియంత్రణ బాధ్యత ఎవరిది?
 ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను నియంత్రించాల్సిన బాధ్యత ఎవరిపై ఉందో కూడా  విద్యాశాఖ అధికారులు తేల్చలేకపోతున్నారు. ఫీజులను నియంత్రించాల్సిన బాధ్యత అధికారులదే అంటుంటే.. అధికారులు మాత్రం తల్లిదండ్రులదే అంటూ దాటవేస్తున్నారు. విద్యా హక్కు చట్టం.. ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణలో విద్యాశాఖ అధికారులతో పాటు తల్లిదండ్రుల బాధ్యత ఉందని స్పష్టం చేస్తోంది. ఇందుకు ఫీజుల నిర్ణయం తీసుకునేందుకు గాను పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై వారి సమక్షంలోనే ఫీజులను నిర్ణయించాలి. కాని ఏ ఒక్క పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించిన పాపాన పోలేదు. కాని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సిండికేట్‌గా మారి ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తున్నాయి.  

నేటి నుంచి విద్యాసంస్థల బంద్‌కు పిలుపు..
 శ్రీ చైతన్య స్కూల్ గుర్తింపును రద్దుతోపాటు, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి శనివారం వరకు విద్యాసంస్థల బంద్‌ను నిర్వహిస్తున్నట్టు బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు బీరయ్య యాదవ్ తెలిపారు. శనివారం పట్టణంలోని చైతన్య స్కూల్ ఎదుట ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సంఘం రాష్ట్ర కార్యదర్శి సిరిబాబు ఆత్మహత్యాయత్నానికి కారణమైన ప్రైవేట్ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  బంద్‌కు అన్ని విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతునివ్వాలని బీసిసంఘం నాయకులు కోరారు.

మరిన్ని వార్తలు