అవినీతి రహితంగా జైళ్లశాఖ: నాయిని

18 Sep, 2014 01:30 IST|Sakshi
అవినీతి రహితంగా జైళ్లశాఖ: నాయిని

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని  జైళ్ల శాఖను అవినీతి రహితంగా మారుస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం ఆయన చంచల్‌గూడ జైలును సందర్శించారు. ఇటీవల జైళ్ల శాఖ ప్రారంభించిన విద్యాదాన్ యోజనలో భాగంగా మహిళల జైల్లో టీసీఎస్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ తరగతులను ఆయన ప్రారంభించారు. చంచల్‌గూడ జైలుతో తనకు అవినాభావ సంబంధం ఉందనీ.. ఎమర్జెన్సీ సమయంలో 18 నెలల పాటు ఇదే జైల్లో గడిపినట్లు ఈ సందర్భంగా నాయిని గుర్తు చేసుకున్నారు. ఆయన జైల్లో ఖైదీలతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యాదాన్ యోజన బాగుందని తద్వారా చదువులేని ఖైదీలను అక్షరాస్యులుగా మార్చవచ్చన్నారు.

వివిధ కేసులకు సంబంధించి అయిదేళ్లు శిక్ష పూర్తి చేసుకున్న తమను క్షమాభిక్ష కింద విడుదల చేయాలని ఖైదీలు ఈ సందర్భంగా కోరారు. ఈ విషయమై సీఎంతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని వారికి మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ జైల్లో మగ్గుతున్న జీవిత ఖైదీలను క్షమాభిక్ష కింద విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మహిళల జైల్లోని బేకరీ యూనిట్‌ను సందర్శించి కొన్ని వస్తువులను నాయిని కొనుగోలు చేశారు. జైలు బయట ఔట్‌లెట్లు ప్రారంభించి బేకరీలను నడపాలని అధికారులకు మంత్రి నాయిని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్, ఇన్‌చార్జ్ ఐజీ చంద్రశేఖర్ నాయుడు, పురుషుల జైలు సూపరింటెండెంట్ సైదయ్య, మహిళల జైలు సూపరింటెండెంట్ బషీరాబేగం తదితరులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు