యువత పై పట్టింపేది..

28 Oct, 2018 07:58 IST|Sakshi
యువజన సర్వీసుల శాఖ కార్యాలయం

ఆదిలాబాద్‌అర్బన్‌: యువజన సర్వీసుల శాఖ(స్టెప్‌)పై సర్కారు చిన్నచూపు చూస్తోంది. గత నాలుగేళ్లుగా ఎలాంటి సంక్షేమ యూనిట్లు గానీ వాటికి సంబంధించి రుణాలూ విడుదల చేయడం లేదు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం యువజన సంఘాలను పట్టించుకోకపోవడంతో గ్రూపులలోని సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను పక్కాగా ప్రజల్లోకి తీసుకువెళ్లి వాటి ప్రాముఖ్యతను వివరించడంతోపాటు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న యువతకు ప్రభుత్వం చేయూతనివ్వకపోవడంతో ముందుకు వెళ్లలేకపోతున్నారు.

నేటి సమాజానికి చేదోడువాదోడుగా ఉంటూ సామాజిక సేవ చేస్తున్న యువతను గుర్తించి గ్రూపులుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం రెండేళ్ల క్రితం జిల్లా అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే యువతను గుర్తించిన అధికారులు వారిని గ్రూపులుగా ఏర్పాటు చేశారు. వీరికే ఆర్థిక సాయం అందించే విధంగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నా.. యూనిట్ల మంజూరు, రుణాల విడుదలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి   స్పందన రావడం లేదు. కాగా, ప్రతి యేడాది యూనిట్ల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నా.. ఈ నాలుగేళ్లలో ఇంతవరకు ఏ ఒక్క సారి కూడా రుణాలు మంజూరు కాలేదంటే సర్కారుకు యువతపై ఉన్న శ్రద్ధ ఇట్టే అర్థమవుతోంది.

300 యూనిట్లు.. 566 యూత్‌ గ్రూపులు..  
జిల్లాలోని యూత్‌ గ్రూపుల సభ్యులకు ప్రభుత్వం ద్వారా అందించే స్వయం ఉపాధి యూనిట్లకు ఆర్థిక సాయం అందించేందుకు జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గత నాలుగేళ్లుగా ఇలాంటి ప్రతిపాదనలు పంపినా ప్ర భుత్వం పక్కన పెడుతూ వచ్చింది. 2016–17లో జిల్లాకు 700 యూనిట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినా.. ఏ ఒక్కటి మంజూరు చేయలేదు. 2017–18 సంవత్సరంలో జిల్లాకు 400 యూని ట్లు కేటాయించాలని నివేదించినా.. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. తాజాగా 2018–19 ఆర్థి క సంవత్సరానికిగాను జిల్లాకు 300 యూనిట్లు కేటాయించాలని నివేదించగా ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు.

దీంతో ప్రభుత్వం మంజూరు చేసే స్వయం ఉపాధి యూనిట్లపై యువత ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం వరుసగా నాలుగేళ్ల నుంచి ఎలాంటి స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయకపోవడంతో యూత్‌ గ్రూపులలోని సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా, జిల్లాలో మొ త్తం 566 యూత్‌ గ్రూపులు రిజష్టరై ఉన్నాయి. ఈ గ్రూపుల్లో సుమారు 5 వేల మందికిపైగా యువత సభ్యులుగా ఉన్నారు. జిల్లాలోని పాత 13 మండలాల్లో యూత్‌ గ్రూపులు ఏర్పాటు అయ్యాయి. అత్యధికంగా ఇచ్చోడ మండలంలో 92 యూత్‌ గ్రూపులు ఉండగా, గుడిహత్నూర్‌ మండలంలో అతి తక్కువగా 16 గ్రూపులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. యువజన సర్వీసుల శాఖ ద్వారా అందించే స్వయం ఉపాధి యూనిట్లు ఈ గ్రూపుల సభ్యులకే వర్తింపజేస్తారు.

గతంలో ‘స్వయం ఉపాధి’ ఇలా.. 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో యువజన సర్వీసుల శాఖకు ప్రతియేడాది స్వయం ఉపాధి రుణాల యూనిట్లు ఆయా ప్రభుత్వాలు కేటాయిస్తూ వచ్చాయి. అప్పట్లో ప్రభుత్వం ప్రతి యేటా యూనిట్ల కేటాయింపుకు ప్రతిపాదనలు కోరడం, అందుకు తగిన రుణాలు విడుదల చేయడం వంటివి జరిగేది. దరఖాస్తులు చేసుకున్న యువతకు ఆటోట్రాలీ, ప్యాసింజర్‌ ఆటో, డెస్క్‌టాప్‌ ప్రింటింగ్‌(డీటీపీ), జిరాక్స్‌ సెంటర్, ఇతర యూనిట్లు ఇచ్చి యువతను ప్రోత్సహించే వారు. దీంతో జిల్లాలోని యువతకు స్వయం ఉపాధి దొరకడంతోపాటు వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం సాయం అందించేది. కాలానుగుణంగా వచ్చిన ప్రభుత్వాలు పూర్తి భిన్నంగా మార్చేశాయి. నాలుగేళ్లుగా యూనిట్ల మంజూరుపై ఎలాంటి స్పందన రాకపోవడంతో యువత సంవత్సరాల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. 

ప్రతిపాదనలు పంపుతున్నాం.. 
ప్రతి యేడాది స్వయం ఉపాధి యూనిట్ల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నాం. కానీ ఈ నాలుగేళ్లలో ఇంత వరకు మంజూరు కాలేదు. యూనిట్ల కేటాయింపు ప్రభుత్వ స్థాయిలో ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే ఉంది. ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఈ యేడాది కూడా యూనిట్ల ప్రతిపాదనలు పంపించాం. రాబోయే ఎన్నికల అనంతరం మంజూరు కేటాయించవచ్చు. – వెంకటేశ్వర్లు, సీఈవో,యువజన సర్వీసుల శాఖ  

మరిన్ని వార్తలు