నిబంధనలు అతిక్రమిస్తే గుర్తింపు రద్దు

17 Oct, 2017 02:21 IST|Sakshi

సెలవుల్లో పిల్లలను ఇంటికి వెళ్లనివ్వని స్కూళ్లు, కాలేజీలపై చర్యలు

విద్యా శాఖాధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: కార్పొరేట్‌ కాలేజీలు, స్కూళ్లలో అమలు చేస్తున్న విద్యా విధానంపై తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనలను, మార్గదర్శకాలను పాటించనట్లు తేలితే ఆయా విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో పాఠాలు బోధించేలా కాలేజీలు, స్కూళ్ల విద్యా విధానం ఉండాల్సిందేనని పేర్కొంది.

కార్పొరేట్‌ కాలేజీలు, స్కూళ్లలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యా శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం సమీక్ష నిర్వహించారు. కార్పొరేట్‌ కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడటం బా«ధాకరమన్నారు. ఆత్మహత్యల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై కార్పొరేట్‌ కాలేజీలు, స్కూళ్లు, ఇంటర్నేషనల్‌ స్కూళ్ల యాజమాన్యాలు, తల్లిదండ్రుల సంఘాలతో నేడు (మంగళవారం) సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఆత్మహత్యల నివారణకు, పిల్లలపై మానసిక ఒత్తిడి లేకుండా, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల సామర్థ్యాలను గుర్తించి వారికి తగిన కోర్సులు, కాలేజీల్లోనే చేర్పించాలని, వారికి ఇష్టమైన కోర్సులు, కాలేజీల్లో చదువుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. సెలవుల్లో పిల్లలు ఇళ్లకు వెళ్లనివ్వకుండా ర్యాంకుల కోసం వారిపై ఒత్తిడి పెంచడం మానుకోవాలని కాలేజీ యాజమాన్యాలకు సూచించారు.

అన్ని కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో కౌన్సిలింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కౌన్సిలింగ్‌ సెంటర్లకు తల్లిదండ్రులను అనుమతించి వారి సందేహాలను, అనుమానాలను నివృత్తి చేయాలని, పిల్లల్లో భయాలను తొలగించాలన్నారు. కాలేజీల్లో విద్యార్థులకు ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే తల్లిదండ్రుల దృష్టికి లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే చర్యలు చేపడతామన్నారు. ఈ సమీక్షలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, పాఠశాల విద్యా డైరెక్టర్‌ కిషన్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు