‘అనాథల’ పథకాలపై సమీక్ష

26 Jun, 2015 01:25 IST|Sakshi

కడియం నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనాథలకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏమిటి? ఇంకా మెరుగైన ఫలితాలను సాధించేందుకు ప్రభుత్వపరంగా ఏంచేస్తే బావుంటుందనే దానిపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం ప్రభుత్వపరంగా, స్వచ్ఛంద సంస్థలు, ఇతరత్రా చేపడుతున్న కార్యక్రమాల వల్ల అనాథలకు ఏ మేరకు మేలు జరుగుతుందన్న అంశాన్ని పరిశీలిస్తోంది.

గురువారం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రి జోగు రామన్న తదితరులతో కూడిన టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీ అయ్యింది.  ప్రస్తుతం అనాథల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాల తీరు ఎలా ఉంది, వాటికి మెరుగులు దిద్ది మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఏంచేస్తే బావుంటుందనే దానిపై చర్చించారు. ఆయా అంశాలకు సంబంధించి పరిశీలన జరిపి టాస్క్‌ఫోర్స్ కమిటీకి నివేదికలు సమర్పించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల అధికారులను కడియం ఆదేశించారు.  ఈ నెల 30న జరిగే సమావేశానికల్లా ఆయా శాఖలు, ఇతరత్రా నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.  
 
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన జ్యోతిరెడ్డి..
రాష్ట్రంలో అనాథలను చేరదీసి వారికి విద్యాబుర్ధులు నేర్పించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంపై తెలంగాణకు చెందిన పారిశ్రామికవేత్త జ్యోతిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనాథ బాలల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి సహా అనేక మంది ప్రముఖులను కలసి చేసిన విజ్ణప్తికి సానుకూలంగా స్పందించారని ఆమె ఒక ప్రకటనలో ఆనందం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు