ప్రైవేటు నుంచి గురుకులాల్లోకి..

17 Nov, 2017 03:33 IST|Sakshi

శాసన మండలిలో ఉపముఖ్యమంత్రి కడియం  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ గురుకులాలవైపు విద్యార్థులు తరలి వస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శాసనమండలిలో గురువారం ‘రాష్ట్రంలో ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు’పై జరిగిన లఘు చర్చ సందర్భంగా కడియం మాట్లాడారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు విద్యా సంస్థల వైపు విద్యార్థులు తరలివెళ్లేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందన్నారు. గతంలో రాష్ట్రంలో 296 గురుకుల పాఠశాలలుంటే, తెలంగాణ వచ్చాక కొత్తగా 546 గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ. 1.02 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వెల్లడించారు.  మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, కానీ వాటిల్లో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల భర్తీ జరగలేదన్నారు.

ముఖ్యమంత్రి   నియోజకవర్గం గజ్వేల్‌లోని ఆశ్రమ పాఠశాలలో నీటి వసతి లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా  ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి మధ్యలో జోక్యం చేసుకోగా, ‘ఏమండీ... ఓపిక లేకపోతే ఎలా? పంతులై ఉండి.. ఇలాగైతే చదువు ఎలా చెబుతారు?’అంటూ షబ్బీర్‌ అన్నారు. దీంతో కాసేపు సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ సభ్యుడు రామచందర్‌రావు మాట్లాడుతూ.. హేతుబద్ధీకరణ, ఆశ్రమ పాఠశాలలు రావడం వల్ల ఇతర ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని పేర్కొన్నారు. గురుకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఇదే అంశంపై సభ్యులు సతీశ్‌కుమార్, ఫరూక్‌ హుస్సేన్, బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడారు. 

మరిన్ని వార్తలు