రెండేళ్లు ఉంటా.. 2 కోట్లు కావాలి!

9 May, 2017 03:01 IST|Sakshi
రెండేళ్లు ఉంటా.. 2 కోట్లు కావాలి!

బోధన్‌ స్కాంలో మరో తిమింగళం
తెరపైకి డిప్యూటీ కమిషనర్‌ అవినీతి బాగోతం

ఏ–1 శివరాజుతో ములాఖత్‌ అయినట్టు గుర్తించిన సీఐడీ
ఒప్పందంలో భాగంగా రూ. 25 లక్షల అడ్వాన్స్‌
శివరాజు కుమారుడు సునీల్‌తో ఒప్పందం
సర్కిళ్లు, చెక్‌పోస్టుల నుంచి నెలకు రూ. 10 లక్షలు
అక్రమార్జన సొమ్ముతో రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి


సాక్షి, హైదరాబాద్‌
బోధన్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ స్కాంలో అవినీతి తిమింగళాల పాత్ర బయటపడుతోంది. ఇప్పటికే ఈ కేసులో తొమ్మిది మంది వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బంది అరెస్ట్‌ కాగా తాజాగా మరో డిప్యూటీ కమిషనర్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీఐడీ విచారణలో కళ్లు బైర్లు కమ్మే అవినీతి బండారం బయటపడింది. పోస్టింగ్‌ పొందగానే శివరాజు(కేసులో ఇప్పటికే అరెస్టయిన ఏ–1 నిందితుడు)ను దర్శనం చేసుకునేందుకు డిప్యూటీ కమిషనర్లు ఉవ్విళ్లూరుతారట!

రెండేళ్లు నేనే ఉంటా..
డిప్యూటీ కమిషనర్‌(డీసీ)గా ఉన్న ఓ అధికారి తనకు కోట్లలో ముట్టజెప్పాలని డిమాండ్‌ చేశారు. శివరాజు కుమారుడు సునీల్‌తో సదరు డీసీ నేరుగా బేరసారాలు సాగించినట్టు సీఐడీ అధికారులు తెలిపారు. ‘రెండేళ్లపాటు పనిచేస్తా కాబట్టి ఏడాదికి రూ.కోటి చొప్పున రెండేళ్లకు రూ.2 కోట్లు ఇవ్వాల్సిందే..’అని ఆ డీసీ స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో ముందుగా అడ్వాన్స్‌ కింద రూ.25 లక్షలు నగదు చెల్లించినట్టు సునీల్‌ తన వాంగ్మూలంలో వెల్లడించినట్టు సీఐడీ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. అంతేకాదు మిగిలిన మొత్తాన్ని ప్రతినెలా రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్టు తెలిపారు. అలా ఇప్పటివరకు రూ.80 లక్షలు సంబంధిత డిప్యూటీ కమిషనర్‌కు అందినట్టు విచారణలో బయటపడినట్లు ఆయన తెలిపారు.

ప్రతీ ఆడిటింగ్‌కు ఓ రేటు
వాణిజ్య పన్నుల శాఖలో ఒక్కో అధికారికి నెలకు 4 లేదా 5 ఆడిటింగ్‌లు చేయాలని ఆదేశాలుంటాయి. దీని ప్రకారం సంబంధిత అధికారులు ఆడిటింగ్‌ నిర్వహిస్తారు. ఇక్కడ కూడా సంబంధిత డిప్యూటీ కమిషనర్‌ రేటు ఫిక్స్‌ చేసినట్టు సీఐడీ వెలుగులోకి తెచ్చింది. ఒక్కో ఆడిటింగ్‌లో టర్నోవర్‌ను బట్టి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్టు గుర్తించారు.

ఏడు సర్కిళ్లు, నాలుగు చెక్‌పోస్టులు
సంబంధిత డిప్యూటీ కమిషనర్‌ కింద ఏడు సర్కిల్‌ కార్యాలయాలు, నాలుగు ప్రధాన చెక్‌ పోస్టులున్నాయి. వీటి నుంచి సాగే జీరో దందా వ్యాపార సంస్థల వాహనాల నుంచి వసూలు చేసిన లంచాల్లో మెజారీటీ శాతం డిప్యూటీ కమిషనర్‌దేనని సీఐడీ తేల్చింది. ఇలా రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు పై స్థాయిలో ఉన్న అధికారులకు ఈ డిప్యూటీ కమిషనర్‌ ద్వారానే చేరుతుందని సీఐడీ గుర్తించింది.

అక్రమార్జనతో బిజినెస్‌...
అక్రమార్జనతో సంపాదించిన కోట్ల రూపాయాలను సదరు డిప్యూటీ కమిషనర్‌ హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్‌ ఎస్టేట్, నిర్మాణ సంస్థలో పెట్టుబడిగా పెట్టినట్టు సీఐడీ గుర్తించింది. ప్రతి శుక్రవారం లేదా సోమవారం కార్యాలయానికి వెళ్లడం, తనకు రావాల్సిన వాటాను తీసుకోవడం, తన వెంట వచ్చే తండ్రికి ఆ మొత్తాన్ని ఇచ్చి ఆర్టీసీ బస్సులో పంపించడం ఆ డిప్యూటీ కమిషనర్‌ స్టయిల్‌ అని తేలింది.

పోస్టింగ్‌కు రూ.30 లక్షలు
హైదరాబాద్‌లో పోస్టింగ్‌ ఇప్పించాలంటూ ఈ డిప్యూటీ కమిషనర్‌ గతంలో ఓ మంత్రి ఓఎస్డీకి రూ.30 లక్షలు ముట్టజెప్పారు. తీరా పోస్టింగులు అయ్యే సమయంలో మంత్రి పైరవీ పని చేయలేదు. అందరిలాగే సాదాసీదా బదిలీపై పోస్టింగ్‌ ఇచ్చారు. దీంతో తాను పోస్టింగ్‌ కోసం ఇచ్చిన రూ.30 లక్షలు ఇవ్వాలని ఓఎస్డీని డీసీ గట్టిగా నిలదీశారు. తన వద్ద లేవని, వెళ్లి మంత్రిగారితో చెప్పుకోండని సదరు ఓఎస్డీ తెగేసి చెప్పారు. మంత్రిని అడిగేందుకు ధైర్యం చాలకపోవడంతో ఇచ్చిన పోస్టింగ్‌కే వెళ్లారు.

మలేసియా ప్యాకేజీ రూ.2.5 లక్షలు
సంబంధిత డిప్యూటీ కమిషనర్‌ ఐదు నెలల క్రితం మలేసియా వెళ్లినట్టు సీఐడీ గుర్తించింది. ఆ దేశం వెళ్లేందుకు రూ.2.5 లక్షల ఖర్చును తామే భరించినట్లు సునీల్‌ విచారణలో ఒప్పుకున్నాడని సీఐడీ అధికారి ఒకరు స్పష్టంచేశారు. ఇది కూడా ఒప్పందంలో భాగంగానే జరిగిందని సునీల్‌ చెప్పినట్టు ఆయన తెలిపారు. ఈ వివరాలన్నీ ఏసీబీ అధికారులు సైతం వాకబు చేశారని, వాటితో ఒక నివేదిక రూపొందించి వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి పంపించారని, త్వరలోనే ఏసీబీ కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందని సమాచారం.

మరిన్ని వార్తలు