డిప్యూటీ మేయర్‌ను చేసిన ఉద్యమం

15 Mar, 2016 01:38 IST|Sakshi
డిప్యూటీ మేయర్‌ను చేసిన ఉద్యమం

సొంతూరు పున్నేలు.. రాయపురలో నివాసం
ఇదీ డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్ ప్రస్తానం

 
హన్మకొండ చౌరస్తా : తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో ప్రదర్శించిన పోరాట పటిమ.. ఓ యువకుడికి కీలక పదవి తెచ్చిపెట్టింది. మైనార్టీ కావడంతో పాటు ఉద్యమంలో పాల్గొనడం ఆయనకు కలిసొచ్చాయి. కార్పోరేషన్ ఎన్నికల బరిలోకి అనూహ్యంగా వచ్చిన  ఖాజా సిరాజుద్దీన్‌ను ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవి వరించడంపై మైనార్టీల్లో ఆనందాన్ని నింపింది.
 
తండ్రి ప్రభుత్వ ఉద్యోగి..
వర్దన్నపేట మండలం పున్నేలు సిరాజొద్దీన్ సొంత ఊరు. ఆయన తండ్రి షంషుద్దీన్ జిల్లాలోని నల్లబెల్లి మండలం ఎంఆర్‌ఓ ఆఫీసులో సూపరింటెండెంట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. కొంతకాలం క్రితం ఆయన కన్నుమూశారు. ఈ మేరకు తల్లి ముర్షదీబేగం, భార్య మెహరాజ్, ఇద్దరు కుమార్తెలు నిఫ్రా, ముస్కాన్‌తో కలిసి హన్మకొండలోని పాత రాయపురలో సిరాజుద్దీన్ నివాసముంటున్నారు. కాగా తమకు సొంత ఊరు పున్నేలులో వ్యవసాయ భూమి ఉందని సిరాజుద్దీన్ సోదరుడు తాజుద్దీన్ తెలిపారు. తండ్రి ఉద్యోగం కోసం దశాబ్దాల క్రితం ఊరు నుంచి వచ్చినప్పటికీ సొంతూరు, అక్కడి ప్రజలతో ఇప్పటికీ సంబందాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
 
2001 నుంచి టీఆర్‌ఎస్‌లో..
డిగ్రీ పూర్తి చేసిన సిరాజుద్దీన్ 2001 నుంచి టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్నారు. పార్టీలో అర్బన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పదవులు చేపట్టారు. ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లో 41వ డివిజన్ నుంచి పోటీ చేసిన ఆయన స్వతంత్య్ర అభ్యర్థి పుప్పాల ప్రభాకర్‌పై 733 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సిరాజుద్దీన్ సంతానమైన నిఫ్రా ఎనిమిదో తరగతి, ముస్కాన్ నాలుగో తరగతి నయీంనగర్‌లోని తేజస్వి పాఠశాలలో చదువుతున్నారు.
 
 

మరిన్ని వార్తలు