ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై రవాణాశాఖ కొరడా

19 Aug, 2019 18:05 IST|Sakshi

హైదరాబాద్‌ : నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులపై డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ పాపారావు  కొరడా ఝుళిపించారు. ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టి యథేచ్చగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పాపారావు ఆధ్వర్యంలో పలు బృందాలుగా ఏర్పడిన రవాణాశాఖ అధికారులు ఆదివారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు జరిపారు. పాపారావు కూడా తనిఖీల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు, బెంగళూరు వైపు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు జరిగిన ఈ దాడుల్లో అధికారులు దాదాపు 200 బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 44 బస్సులపై అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల వల్ల రవాణా శాఖకు రూ. 22 లక్షల ఆదాయం రావడం గమనార్హం.

ఈ తనిఖీలకు సంబంధించి పాపారావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి రవాణాశాఖ అధిక ఆదాయాన్ని చేకూర్చే వనరుగా ఉందన్నారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలపై జరిమానాలు విధించి ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని మరింతగా పెంచాలన్నారు. అక్రమంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.  మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు