‘వాట్సప్‌’తో స్పందించిన డిప్యూటీ స్పీకర్‌  

7 May, 2018 09:16 IST|Sakshi
ఎన్‌ఆర్‌ఐలతో పరశురాములు

దుబాయ్‌లో క్షతగాత్రున్నిఆదుకున్న పద్మాదేవేందర్‌రెడ్డి

ఎన్‌ఆర్‌ఐల సహకారంతో సహాయ ఏర్పాట్లు

రామాయంపేట, నిజాంపేట(మెదక్‌) : దుబాయ్‌ నుంచి వచ్చిన వాట్సప్‌ సమాచారానికి స్పందించిన డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి అక్కడి ఎన్‌ఆర్‌ఐల సహకారంతో క్షత్రగాత్రున్ని ఆసుపత్రిలో చేర్పించి  మంచి మనసును చాటుకున్నారు.

టూరిస్ట్‌ వీసాపై వెళ్లి..

నిజాంపేట మండలం  రాంపూర్‌ గ్రామానికి చెందిన యువకుడు  అనుప పరశురాములుకు భార్యతోపాటు బాబు ఉన్నాడు. పేదస్థితిలో ఉన్న పరశురాములు ఐదారు నెలలక్రితం బతుకుదెరువు నిమిత్తం విజిట్‌ వీసాపై దుబాయ్‌ వెళ్లాడు.  వీసా గడువు ముగియగా, అతడు షార్జాలోని ఒక కంపెనీలో రహస్యంగా పనిచేసుకుంటున్నాడు. ఇటీవలే అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పరశురాములు కాలు విరిగింది.

ఆసుపత్రిలో చేర్పించడానికి అక్కడి చట్టాలు అంగీకరించకపోవడంతో అతన్ని ఒక గదిలో ఉంచారు. ఈవిషయమై అక్కడ ఉన్న అతని స్నేహితులు కొందరు ఈ విషయమై రాత్రి నేరుగా ఫోన్‌లో వాట్సప్‌ ద్వారా డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆమె అక్కడి ఎన్‌ఆర్‌ఐలు శ్రీనివాసరావు, అనిల్, ఉపాసన సహాకారంతో పరశురాములును చికిత్స నిమిత్తం అక్కడి ఆసుపత్రిలో చేర్పించారు.

పరుశరాంలు తన స్వగ్రామానికి వచ్చేవిధంగా సహాకరించాలని డిప్యూటీ స్పీకర్‌ వారిని కోరారు. త్వరలో పరశురాములు తన స్వగ్రామానికి చేరుకుంటారని పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సమయానికి స్పందించిన పద్మాదేవెందర్‌రెడ్డి మంచి మనసును గ్రామస్తులు మెచ్చుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు