అర్హులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు

22 Feb, 2016 02:52 IST|Sakshi
అర్హులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు

తెల్లకార్డులు ఉన్న ఆడబిడ్డలందరికీ కల్యాణలక్ష్మి
మార్చి నుంచి వ్యవసాయానికి
తొమ్మిదిగంటల విద్యుత్
రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్


చందుర్తి : రాష్ట్రంలో అర్హులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మండలంలోని రుద్రంగిలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు, మల్యాలలో విద్యుత్ సబ్‌ష్టేషన్ నిర్మాణాలకు ఆదివారం భూమిపూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో 400 డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరుకాగా.. మొదటి విడతలో రుద్రంగికి 35 ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. తెల్లకార్డు ఉన్న కుటుంబంలోని ఆడబిడ్డకు ఉగాది నుంచి కల్యాణలక్ష్మి వర్తింపజేయనున్నట్లు చెప్పారు. కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంతాన్ని గోదావరి నదీ జలాలతో రానున్న రెండేళ్ల కాలంలో సస్యశ్యామలం చేస్తామన్నారు.  వ్యవసాయూనికి పొద్దంతా తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం 28 లక్షలమందికి రూ.800 కోట్లు ఇస్తే.. తమ ప్రభుత్వం ఆసరా పథకం ద్వారా 38 లక్షల మందికి రూ.5వేల కోట్లు పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు.

పెళ్లి చేసుకుని భర్తలు వదిలేసిన వారికి, జోగినిలకు త్వరలో పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ ద్వారా ఏడాదిలోగా ఇంటింటికీ నల్లా నీరు అందిస్తామన్నారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు మాట్లాడుతూ రుద్రంగికి రెండో విడతలో మరో 50, రానున్న మూడేళ్లలో 300 గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, సిరిసిల్ల ఆర్డీవో భిక్షానాయక్, జెడ్పీటీసీ సభ్యులు అంబటి గంగాధర్, ఎంపీపీ తిప్పని శ్రీనివాస్, ఎంపీడీవో నాగరాజు, తహశీల్దార్ రవీంద్రచారి, సర్పంచులు బైరి గంగరాజు, జలగం కిషన్‌రావు, దొంగరి భూమయ్య, ఎంపీటీసీలు చెలుకల చిన్నరాజవ్వ, మోతె జల, అల్లూరి పావని తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు