పోరాటమా.. విశ్రాంతా?

3 Jun, 2015 01:52 IST|Sakshi
పోరాటమా.. విశ్రాంతా?

నిర్వేదంలో జానారెడ్డి
కలుషిత రాజకీయాల్లో కొనసాగడం బాధాకరం
దిగజారుడుతనంతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీఆర్‌ఎస్
డబ్బులను వెదజల్లి అధికారం లాక్కోవాలని టీడీపీ ప్రయత్నం
నీతి బాహ్యమైన రాజకీయాలను ప్రజలు చూస్తున్నారని వ్యాఖ్య

 
హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలపై ప్రతిపక్షనేత జానారెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. కలుషిత రాజకీయాలను చూస్తూ కూడా రాజకీయాల్లో ఉండడం బాధాకరమని, ఈ రాజకీయాలపై పోరాటం చేయాలో, విశ్రాంతి తీసుకోవాలో తెలియడం లేదని ఆయన వాపోయారు. మంగళవారం అసెంబ్లీలో శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, ఏడాది కాలంలో జరిగిన ఫిరాయింపులపై జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దిగజారుడుతనంతో అధికారం నిలబెట్టుకోవాలని టీఆర్‌ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, అధికారాన్ని లాక్కోవాలని టీడీపీ డబ్బులను వెదజల్లుతోందని ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను అధికారపార్టీలోకి చేర్చుకుని మంత్రిని చేయడమేంటని ప్రశ్నించారు.

 ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారు
అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టి, బెదిరించి అధికారపార్టీలో చేర్చుకున్నారని జానారెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం డబ్బులు ఇస్తూ దొరికిపోయిన సంఘటనలు చూడడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో కొనసాగాలా వద్దా అనేది శ్రేయోభిలాషులు, సన్నిహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒకవేళ రాజకీయాల నుంచి తప్పుకొంటే కాంగ్రెస్‌ను మాత్రమే ప్రమోట్ చేస్తానని చెప్పారు. నీతి బాహ్యమైన రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. దిగజారుడు, కలుషిత రాజకీయాలను ఎప్పటికప్పుడు ప్రజలు గమనిస్తూనే ఉంటారని జానా చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత గెలుపు తమ పార్టీ ఎమ్మెల్యేల ఐక్యతకు నిదర్శనమన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తామని పేర్కొన్నారు.
 
ఏపీ సీఎం ప్రత్యక్ష బాధ్యుడు..
 రాజకీయాల్లో అనైతిక ఘటనలకు ఏపీ ముఖ్యమంత్రి ప్రత్యక్ష బాధ్యుడని, ఆయనపై కేసు నమోదు చేయాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వీటికి బాధ్యుడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి దొరికిన దొంగ అయితే, ఫిరాయింపులకు కారణమైన దొంగల సంగతేంటని ప్రశ్నించారు.
 

>
మరిన్ని వార్తలు