‘నీట్‌’గా అమ్మకానికి పెట్టేశారు!

20 Jul, 2018 02:50 IST|Sakshi

ఆన్‌లైన్‌లో 2.5 లక్షల మంది అభ్యర్థుల వివరాలు

ప్రశ్నార్థకంగా మారిన సమాచార గోప్యత

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న లీకేజీ

లీకేజీ జరగలేదంటున్న నీట్‌ డైరెక్టర్‌

ఇటీవల ఫేస్‌బుక్‌ వినియోగదారుల డేటా లీకై ఎన్నికలను ప్రభావితం చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు నీట్‌ అభ్యర్థుల డేటా లీకేజీ కోచింగ్‌ సెంటర్‌లకు కల్పతరువుగా మారుతోంది. దాదాపు రెండున్నర లక్షల మంది నీట్‌ అభ్యర్థుల డేటా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టడం సంచలనం సృష్టిస్తోంది.

దేశవ్యాప్తంగా వైద్య, దంత వైద్య కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ అండ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) గత మేలో జరిగింది. జూన్‌ 4న ఫలితాలొచ్చా యి. మొత్తం 13 లక్షల మంది నీట్‌ పరీక్ష రాశా రు. అందులో 2.5 లక్షల మంది డేటాను ఓ వెబ్‌సైట్‌ అమ్మకానికి పెట్టింది. దీంతో మన దేశంలో సమాచార గోప్యత ప్రశ్నార్థకంగా మారింది. నీట్‌ డేటాబేస్‌లో విద్యార్థి పేరు, నీట్‌లో వారికొచ్చిన స్కోర్, ర్యాంకు, చిరునామా, పుట్టిన తేదీ, సెల్‌ నంబర్, ఈ–మెయిల్‌ ఐడీ ఇలా అన్నీ ఉన్నాయి.

సరైనదో కాదో ఎలా తెలుస్తుంది ?
వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయగానే మచ్చుకి ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల డేటా అందులో కనిపిస్తుంది. డేటా కొనుగోలు చేయాలనుకునే వారు అభ్యర్థు ల సమాచారం సరైందో కాదో ఫోన్‌ ద్వారా సం ప్రదించి తెలుసుకోవచ్చు. సరైన సమాచారమే ఇస్తున్నారన్న నమ్మకం కుదిరితే 2 లక్షల మంది డేటాకు 2.4 లక్షలు చెల్లించాలి. డేటా కొనుగోలు చేసే వాళ్లకి ఈ వెబ్‌సైట్‌ మరిన్ని ఆఫర్లు ఇస్తోంది. విద్యార్థుల్ని ఆకర్షించడానికి ప్రమోషనల్‌ ఎస్‌ఎంఎస్‌లు కూడా పంపిస్తామంటోంది.

విద్యార్థుల నుంచే వివిధ మార్గాల్లో ఈ డేటాను సేకరిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో కెరీర్‌ కౌన్సిలర్స్‌కి సంబంధించి యాడ్స్‌ కనిపిస్తే విద్యార్థులే తమకు ఎక్కడ సీటు వస్తుందో అన్న ఆతృతతో వివరాలన్నీ ఇస్తున్నారు. వాటిని సేకరించిన కొందరు డేటా బ్రోకర్లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడుతున్నారు. అలాగే కొన్ని సంస్థలు పాఠశాలల్లో విద్యార్థులకు మాక్‌ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే వారు తమ వివరాలన్నీ అందించాల్సి ఉంటుంది. అలా సేకరించిన డేటానే అమ్మకానికి పెడుతున్నారు.

ఎవరు కొంటారు?
విద్యార్థుల డేటా లీకేజీ వ్యవహారం రెండు మూడేళ్లుగా చర్చనీయాంశమవుతోంది. 2017లో ఎంబీఏ ఎంట్రన్స్‌ రాసిన 15 లక్షల మంది విద్యార్థుల డేటా ఆన్‌లైన్‌లో అమ్ముడుపోయింది. అప్ప ట్లో కొన్ని వెబ్‌సైట్లు విద్యార్థుల డేటాను అమ్మకానికి పెట్టాయి. నీట్‌లో సరైన స్కోర్‌ రాని వారి ఫోన్‌ నంబర్లను తీసుకొని ఆ విద్యార్థుల వెంటబడుతున్నాయి కొన్ని కోచింగ్‌ సెంటర్లు. తమ వద్ద చేరితే వచ్చే ఏడాది సీటు గ్యారెంటీ అంటూ మభ్యపెడుతున్నాయి.

‘నీట్‌ ఫలితాలు వచ్చినప్పటి నుంచి రోజూ నాకు నాలుగైదు కాల్స్‌ వస్తున్నాయి. ప్రత్యేకమైన కోర్సులు చేయాలంటే మా కాలేజీలో చేరండంటూ పదే పదే కాల్స్‌ చేస్తున్నారు’అంటూ యూపీకి చెందిన ఒక అభ్యర్థి చెప్పారు. చట్టాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం–2008 సరిగ్గా వినియోగంలో లేదని అంటున్నారు. వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5 వేల వరకు డేటా బ్రోకర్‌ సంస్థలున్నాయని అంచనా. ప్రపంచవ్యాప్తంగా బహిరంగంగానే డేటా వెల్లడిస్తున్న ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కోటి వరకు ఉన్నాయి.

డేటా లీకేజ్‌ అవాస్తవం
ఈ డేటా లీకేజీ అంతా అవాస్తమని నీట్‌–యూజీ 2018 డైరెక్టర్‌ డాక్టర్‌ సాన్యమ్‌ భరద్వాజ్‌ చెప్పారు. మీడియాలో వచ్చిన వార్తలు, యూట్యూబ్‌ చానెల్స్‌లో వీడియోలు చూసి లీకేజ్‌ ఆపాదించడం సరికాదని పేర్కొన్నారు. సీబీఎస్‌ఈ పకడ్బందీ గా వ్యవహరిస్తోందని విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు.

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌  

మరిన్ని వార్తలు