కాళేశ్వరం ప్రాజెక్టుకు సమ్మె‘పోటు’

26 Jul, 2018 02:05 IST|Sakshi
కన్నెపల్లిలోని మేడిగడ్డ పంప్‌హౌస్‌

తరిగిపోతున్న సిమెంటు, డీజిల్‌ నిల్వలు 

లారీల ద్వారా నిలిచిపోయిన ముడిసరుకు రవాణా 

మరో మూడు రోజుల వరకే నిల్వలు..! 

ఆపై సమ్మె కొనసాగితే పనులకు ఆటంకమే.. 

ఏడాది కాలంలో తొలిసారి ఎదురైన సవాల్‌

కాళేశ్వరం: లారీల సమ్మెతో జయశంకర్‌ భూపాలపల్లిలో చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కొత్త కష్టాలు వచ్చాయి. సిమెంటు, డీజిల్‌ నిల్వలు తరిగిపోతుండటం.. సమ్మె కారణంగా వచ్చే ముడిసరుకు నిలిచిపోవడంతో మరోమూడు రోజుల్లో ఇక్కడ పనులు నిలిచిపోయే అవకాశం ఉందని ఇంజనీర్లు, ఏజెన్సీల సంస్థల బాధ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించిన తర్వాత ఎండలు, వర్షాలను మినహాయిస్తే లారీల సమ్మె కారణంగా తొలిసారిగా ఇబ్బందులు ఎదురుకానున్నాయని ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. బ్యారేజీలు, పంపుహౌస్‌ల సమాహారమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయువుపట్టు మేడిగడ్డ బ్యారేజీ. ఇక్కడ పనులు పూర్తయితే ప్రాణహిత నది నీటిని ఎత్తిపోతలు, గ్రావిటీ కెనాల్‌ల ద్వారా తెలంగాణ అంతటికీ పారించవచ్చు.

ప్రాణహితలో నీటి ప్రవాహం కారణంగా ఇప్పటికే పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు బెడ్‌ లెవల్‌ వర్క్‌ పూర్తయి పిల్లర్ల దశలో నడుస్తున్నాయి. నిత్యం 3,000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని జరుగుతోంది. దీని కోసం 2,000 టన్నుల సిమెంటు, 3,000 లీటర్ల డీజిల్‌ అవసరం అవుతున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని చోట్ల పది రోజులకు సరిపడా మెటీరియల్‌ను సంబంధిత ఏజెన్సీలు నిల్వ ఉంచుకుంటున్నాయి. సమ్మెతో ఇప్పటికే ఏడు రోజుల పాటు రా మెటీరియల్‌ రాక ఆగిపో యింది. మరో మూడు రోజులకు సరిపడ మా త్రమే ఉంది. సమ్మె ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల తర్వాతæ కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి.  

వరుస కష్టాలు.. 
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎట్టి పరిస్థితుల్లో 2018 జూలై నాటికి నీటిని కొంత మేరకైనా తరలించాలని ఏడాది కాలంగా పనులు వేగంగా చేపడుతున్నారు. వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా పగటి వేళ పనులు నిలిపేసి రాత్రి వేళ కొనసాగించారు. దీంతో సుమారు ముప్పై రోజులపాటు పనులు మందగించాయి. ఆ తర్వాత వర్షాల కారణంగా జూలై 2 నుంచి 13 వరకు పని స్థలాల్లోకి నీరు చేరుకోవడంలో నిర్మాణానికి అడ్డుకట్ట పడింది. మోటార్లు పెట్టి నీటిని తోడి మళ్లీ పనులు ఊపందుకున్న సమయంలో లారీల సమ్మెతో మరోసారి కష్టాలు వచ్చి పడ్డాయి.
 
ఒకేసారి అన్ని చోట్ల 
కీలకమైన మేడిగడ్డ బ్యారేజీతోపాటు కన్నెపల్లి పంప్‌హౌస్, కన్నెపల్లి –అన్నారం గ్రావిటీ కెనాల్, అన్నారం బ్యారేజీ, అన్నారం పంప్‌హౌస్, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌస్‌తోపాటు మేడారం సర్జ్‌పూల్‌ తదితర అన్ని పని ప్రదేశాల్లో డీజిల్, సిమెంటు స్టాకు  పూర్తిగా అడుగంటడం ఇంజనీర్లు, నిర్మాణ ఏజెన్సీలను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని చోట్ల జనరేటర్లు మొదలు లారీలు, టిప్పర్లు, క్రేన్లు, పొక్లెయినర్లు, హైడ్రాలిక్‌ యంత్రాలు, బ్లూమ్‌ ప్రెసర్‌ ఇలా అన్ని భారీ యంత్రాలకు డీజిల్‌ తప్పనిసరి కావడంతో ఈ పరిస్థితి ఎదురైంది. మరోవైపు తమ సమస్యలు పరిష్కారం కాకుంటే సమ్మె విరమించేది లేదని లారీ యూనియన్లు వెనక్కి తగ్గడం లేదు. ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు సైతం సమ్మెలోకి దిగారు. దీంతో ప్రత్యామ్నయ మార్గాలు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి.

మరిన్ని వార్తలు