దేవరకొండలో ఉద్రిక్తత

10 Sep, 2019 08:32 IST|Sakshi

యురేనియం తవ్వకాలకు వచ్చిన అధికారుల అడ్డగింత

గో బ్యాక్‌ అంటూ నినాదాలు.. పోలీసుల రంగ ప్రవేశం

సాక్షి, నల్గొండ: నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాల్లో భాగంగా సర్వే కోసం వచ్చిన అధికారులకు దేవరకొండ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. జిల్లాలోని నల్లమల్ల అడవుల్లో పర్యటించేందుకు సోమవారం రాత్రి ఇక్కడి చేరుకున్న 30 మంది అధికారులు దేవరకొండ సమీపంలోని ఓ లాడ్జ్‌లో బస చేశారు. మంగళవారం ఉదయం అడవిలోకి వెళ్లేందుకు బయటకు వచ్చన వారిని విద్యావంతుల వేదిక నాయకులు అడ్డుకున్నారు. నల్లమల్లకు వెళ్లొదంటూ తీవ్రంగా ప్రతిఘటించారు. గో బ్యాక్‌ అంటూ నినాదాలతో దేవరకొండ సమీప ప్రాంతాలు దద్దరిల్లాయి.  విషయం తెలుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

కాగా కృష్ణానది తీర ప్రాంతం అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ అటవీ పరిధిలోని పలు ప్రాంతాల్లో యురేనియం ఖనిజం తవ్వకాలు జరపాలని, అపారమైన నిల్వలు వెలికితీసి ఖర్మాగారాలను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రదేశమంతా  శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయతీరాలలోనే ఉండటంతో ఆయా ప్రాంతాలలోని నివాసితులంతా యురేనియం నిల్వలు వెలికి తీసేందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దేవరకొండకు చేరుకున్న అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. నల్లమల్లలో ప్రవేశిస్తే  ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు