పీహెచ్‌సీలకు మహర్దశ

12 Jul, 2014 02:38 IST|Sakshi
పీహెచ్‌సీలకు మహర్దశ

నలుగురు వైద్యులు, 30 పడకలు మీడియా ఇష్టాగోష్టిలో డిప్యూటీ సీఎం
 
 హైదరాబాద్: గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ)ను బలోపేతం చేసే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య వెల్లడించారు. నలుగురు వైద్యులు, 30 పడకలతో పీహెచ్‌సీలను తీర్చిదిద్దుతామని వెల్లడించారు. హైడ్రోసిల్, కుటుంబ నియంత్రణ వంటి ఆపరేషన్లను పీహెచ్‌సీల్లోనే నిర్వహించేలా భవిష్యత్ కార్యచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో తనను కలిసి మీడియాతో రాజయ్య ఇష్టాగోష్టిగా మాట్లాడారు.  ఆరోగ్య శ్రీ లబ్ధిదారులు ఎక్కువగా కార్పొరేట్ ఆస్పత్రులనే ఆశ్రయిస్తుండడంతో ప్రభుత్వ డబ్బంతా కార్పొరేట్ జేబుల్లోకే వెళ్తుందన్నారు. ఈ నేపథ్యంలో మేజర్ పంచాయతీల్లోని పీహెచ్‌సీలు, మండల కేంద్రాల్లోని ఆస్పత్రులను బలోపేతం చేసి, ఆరోగ్య శ్రీ కిందకు వచ్చే చిన్నచిన్న రోగాలకు ఈ ఆస్పత్రుల్లోనే వైద్యం అందించేలా భవిష్యత్ ప్రణాళిక ఉంటుందన్నారు.

జర్నలిస్టులకూ ఆరోగ్య బీమా అమలు చేయండి: ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జర్నలిస్టులకూ ఆరోగ్య బీమా పథకం అమలు చేయాలని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ), తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యుజే) నేతలు ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్యకు విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం ఐజేయూ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యుజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీతో పాటు మరికొందరు సచివాలయంలో మంత్రిని కలసి వినతిపత్రం అందించారు. తమ విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారని టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ మీడియాకు తెలిపారు.

సేవలకు దూరంగా ఉన్నోళ్లు రాక్షసులే

‘వైద్యం మానవత్వంతో ముడిపడి ఉంది. అందుకే వైద్యులను దేవుళ్లతో పోలుస్తారు. వైద్యులే కాదు ఆశా వర్కర్ కూడా దేవుడితో సమానం. మానవత్వంతో రోగులకు సేవలందిస్తే దేవుళ్లు.. లేకుంటే రాక్షసులే’ అని ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య అన్నారు. శుక్రవారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవం వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.
 
 

మరిన్ని వార్తలు