బీసీలకు రాజ్యాధికారంలోనూ వాటా

26 Mar, 2018 02:25 IST|Sakshi

బీసీల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : ఈటల 

త్వరలోనే అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు : జోగు

హైదరాబాద్‌: బీసీలకు బర్రెలు, గొర్రెలే కాదు, రాజ్యాధికారంలోనూ వాటా ఇచ్చామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో మెజార్టీగా ఉన్న బీసీ కులాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం నిత్యం పాటుపడుతోందని అన్నారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన బీసీ నేతలు బండ ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్‌కు ఆదివారం ఇక్కడ జరిగిన ఆత్మీయ అభినందన సభలో ఈటల మాట్లాడారు. కుల వృత్తులను, వాటిని నమ్ముకున్న వారికి బ్రతుకునిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాడిగేదెలు, గొర్రెలు, చేపలు ఇస్తుంటే కొంతమంది ఎగతాళి చేశారని, కానీ రాజ్యాధికారంలోనూ వాటా కల్పించాలని మూడు రాజ్యసభ సీట్లలో రెండింటిని బీసీలకు ఇచ్చామని అన్నారు. బీసీల్లోని అన్ని కులాలను ఆర్థికంగా, రాజకీయంగా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.  

బీసీలను పెద్దలసభకు పంపాం.. 
అన్ని పార్టీలు బీసీలతో జెండాలను మోయించుకుంటూ వాడుకుంటుండగా టీఆర్‌ఎస్‌ మాత్రం పెద్దలసభకు పంపిందని బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న అన్నారు. చట్ట సభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం కేంద్రంతో కొట్లాడుతామని, కేసీఆర్‌ ఢిల్లీలో ఒకరోజు ధర్నా చేయనున్నారని చెప్పారు. బీసీలుగా ఉండటం వల్లే పెద్దల సభలో అడుగు పెట్టే అవకాశం తమకు వచ్చిందని బండ ప్రకాశ్, లింగయ్య యాదవ్‌ అన్నారు. బీసీల హక్కుల కోసం పార్లమెంటులో గళం వినిపిస్తామని పేర్కొన్నారు. బీసీలకు మేలు చేసినవారిని గుండెల్లో పదిలపరుచుకుంటామని, అన్యాయం చేస్తే తిరగబడుతామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. కార్యక్రమంలో ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు