మహిళా శ్రామిక శక్తితోనే దేశాభివృద్ధి

9 Mar, 2019 02:32 IST|Sakshi
శుక్రవారం మహిళాదినోత్సవం వేడుకల్లో పాల్గొన్న కేథరిన్‌ హడ్డా తదితరులు

‘వి హబ్‌’ప్రథమ వార్షికోత్సవంలో యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : మహిళా శ్రామిక శక్తిలో ప్రపంచంలోని 131 దేశాల్లో భారత్‌ 120వ స్థానంలో ఉందని, భారత్‌ స్థిరమైన అభివృద్ధి సాధించేందుకు వ్యాపార, వాణిజ్య రంగాల్లోకి మహిళలు ముందుకు రావాలని హైదరాబాద్‌లో యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరీన్‌ హడ్డా అన్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఏర్పాటు చేసిన ‘వి హబ్‌’ప్రథమ వార్షికోత్సవానికి హడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశాన్ని నెరవేర్చడంలో ‘వి హబ్‌’సానుకూల పురోగతి సాధిస్తుందని కితాబునిచ్చారు. భారత శ్రామిక శక్తిలో మహిళలు కేవలం 24% మాత్రమే ఉన్నారని, వ్యాపారవేత్తలుగా రాణించేందుకు వారు ఎక్కువ సంఖ్యలో ముందుకు రావాలన్నారు. ఆంగ్ల రచయిత్రి జేకే రౌలింగ్‌ మాటలను ఉటంకిస్తూ.. ‘ప్రపంచాన్ని మార్చేది ఇంద్రజాలం కాదని.. ప్రపంచాన్ని మార్చేది మానవ శక్తి మాత్రమేనని’వ్యాఖ్యానిస్తూ.. అలాంటి శక్తి మహిళలకే ఎక్కువగా ఉందని కేథరీన్‌ హడ్డా అన్నారు. వివిధ రంగాల్లో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపడంలో ‘వి హబ్‌ ’కీలక పాత్ర పోషిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్టప్‌లు మహిళా వ్యాపారవేత్తలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ అన్నారు. 

సాధికారతకు బాసటగా మెప్మా 
పట్టణ ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా రాష్ట్రంలోని 108 మున్సిపాలిటీల్లో 1.24లక్షల స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళా సాధికారతకు బాసటగా నిలుస్తోందని మెప్మా మిషన్‌ డైరక్టర్‌ డాక్టర్‌ టీకే శ్రీదేవి అన్నారు. మెప్మా ఆధ్వర్యంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు రూ.2 వేల కోట్లు విలువ చేసే వ్యాపారాలు నిర్వహిస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని 1700 మహిళా స్వయం సహాయక సంఘాలను మైక్రో ఎంట్రప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్ల శ్రీదేవి వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్‌లో ముగిసిన ‘నుమాయిష్‌’లో ‘వి హబ్‌’సహకారంతో కొంత మంది మహిళలు 55 స్టాళ్లను ఏర్పాటు చేసిన విషయాన్ని శ్రీదేవి ప్రస్తావించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సం సందర్శంగా ఏర్పాటు చేసిన ‘వి హబ్‌’ప్రథమ వార్షికోత్సవానికి సంస్థ సీఈవో దీప్తి రావుల అధ్యక్షత వహించారు. ‘వి హబ్‌’ద్వారా లబ్ధిపొందిన పలు వురు మహిళా వ్యాపారవేత్తలు తమ అనుభవాలను పంచు కున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్శంగా హైదరాబాద్‌లోని ఫారిన్, కామన్వెల్త్‌ కార్యాలయం నుంచి ఒకరోజు పాటు ‘డిప్యూటీ హై కమిషనర్‌’గా గుర్తింపుపొందిన యువ మహిళ నయోనిక రాయ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు