పోచంపల్లి పర్యాటక కేంద్రం అభివృద్ధికి కృషి

22 Aug, 2014 03:08 IST|Sakshi
పోచంపల్లి పర్యాటక కేంద్రం అభివృద్ధికి కృషి

భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి పర్యాటక కేంద్రం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక అధికారి జి.కిషన్‌రావు తెలిపారు. గురువారం ఆయన పోచంపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ టూరిజం శాఖ, ఇండియన్ ట్రస్ట్ ఫర్ రూరల్ హెరిటేజ్ డెవలప్‌మెంట్(ఐటీఆర్‌హెడ్‌డీ) సంయుక్త భాగస్వామ్యంతోనే పోచంపల్లి గ్రామీణ టూరిజం పార్క్‌ను ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రత్యేక గుర్తింపు(ఐడియల్ డెస్టినేషన్ సెంటర్) తెచ్చేందుకు పాటుపడుతున్నామన్నారు. అందులో భాగంగానే ప్రతి శని, ఆదివారాలు పోచంపల్లికి విదేశీయులను రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
 
 విదేశీయులను ఆకర్షించేలా పోచంపల్లిలో చేనేత, చేతి వృత్తులతో పాటు గ్రామీణ వంటకాలు, చెరువులో బోటింగ్, లేజర్ షో, తెలంగాణ కళలు, గిరిజన నృత్యాలు, గ్రామీణ ప్రజల ఆచారాలు వారికి పరిచయం చేయనున్నట్లు చెప్పారు. అలాగే పోచంపల్లి, యాదగిరిగుట్ట, కొలనుపాకలను కలిపి టూరిజం క్లస్టర్‌గా ఏర్పాటు చేసి రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి టూరిజం బస్సులు నడిపేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. అలాగే  వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్‌లో జరిగే సూరజ్ కుంభమేళాలో మొట్టమొదటి సారిగా తెలంగాణ థీమ్స్ స్టేట్ పేరిట చేనేత ఎగ్జిబిషన్ ఏర్పా టు చేస్తున్నామని పేర్కొన్నారు. జూలై మాసంలో ఫ్రాన్స్‌లో కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
 
 నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో టూరిజం శాఖను అభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతానని చెప్పారు. ప్రజలు కూడా పర్యాటక శాఖకు సహకారం అందించాలని కోరారు. అనంతరం జిల్లా పర్యాటక శాఖ అధికారి మహీధర్ మాట్లాడుతూ మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా జిల్లా ప్రణాళికలో పోచంపల్లి టూరిజం పార్క్‌లో చేనేత ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారన్నారు. ఈ సమావేశంలో అసోసియేట్ హెరిటేజ్ అసోసియేషన్ ఫర్ రూరల్ టూరిజం అంబాసిడర్ యమునా పాఠక్, పర్యాటక శాఖ ఆర్‌ఎం సత్యకుమార్‌రెడ్డి, పోచంపల్లి పర్యాటక కేంద్రం ఇన్‌చార్జ్ అంజనేయులు తదితరులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు