విద్యతోనే అభివృద్ధి సాధ్యం

9 Sep, 2014 02:45 IST|Sakshi

కరీంనగర్ ఎడ్యుకేషన్ : విద్యతోనే అభివృద్ధి సాధ్యమని.. అందరికి విద్యనందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు. 48వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షరాస్యత ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా ప్రజాపరిషత్  సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వుుఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నిరక్షరాస్యతతో అభివృద్ధికి ఆటంకమన్నారు. గ్రామీణ మహిళలు అక్షరాస్యతలో వెనుకబడ్డారని.. విద్య ఆవశ్యకత తెలుసుకోవాలని సూచించారు.
 
ఆమేరకు అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ సంపూర్ణ అక్షరాస్యత సాధన సామాజిక బాధ్యత అని అన్నారు. జిల్లాలో అక్షరాస్యత 64.87 శాతం కాగా పురుషుల అక్షరాస్యత శాతం 74.72 అని, స్త్రీ అక్షరాస్యత శాతం 55.18 ఉందని అన్నారు. జిల్లాలో 10,25,689 మందిని నిరక్షరాస్యులుగా గుర్తించి 3,09,537 మందిని అక్షరాస్యులుగా మార్చామని, మిగిలిన 7 లక్షలకుపైగా ఉన్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను కోరారు.
 
అదనపు జాయింట్ కలె క్టర్ నంబయ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి చదవడం, రాయడం నేర్పించాలన్నారు. మెప్మా పీడీ విజయలక్ష్మి మాట్లాడుతూ అక్షరాస్యతలో విజయనగరం జిల్లాను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి సదానందం, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, వయోజన విద్యాశాఖ ఉపసంచాలకుడు సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు శరత్‌రావు, నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు