అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి వెళ్లాలి

22 Oct, 2014 04:11 IST|Sakshi
అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి వెళ్లాలి

మహబూబ్‌నగర్ టౌన్: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై గ్రామీణ ప్రజలను చైతన్యం చేయూల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని అన్నారు. ఇందుకుగాను నవంబర్‌లో జడ్చర్లలో పౌరసమాచార ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన  హైదరాబాద్ రీజియన్ డెరైక్టర్ పి.ఐ.కె.రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్‌ను కలిశారు.

ఈ సందర్భంగా  కలెక్టర్  తన చాంబర్‌లో జిల్లా అధికారులతో సమీక్షించారు. నవంబర్ 5 నుండి 7వ తేదీ వరకు పౌరసమాచార ఉత్సవాలు నిర్వహించాలని కేంద్రం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని డెరైక్టర్ తెలిపారు. దీనిపై ఆమె స్పందిస్తూ నవంబర్ 8న రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నందున ఆయూ దినాల్లో కాకుండా  ఉత్సావాలు నిర్వహిద్దామని సూచించారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సహకారం అందిస్తామన్నారు.

డెరైక్టర్ పీఐకెరెడ్డి మాట్లాడుతూ గతంలో వనపర్తి, గద్వాలలో ఈ తరహా ఉత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న గృహ నిర్మాణం, తాగునీటి సరఫరా, విద్యుద్దీకరణ, ఉపాధి హామీ, ఐసీడీఎస్, సమాచార హక్కు చట్టంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, స్వచ్చభారత్, మెకిన్ ఇండియా, బేటీబచావ్, బేటీ పడాన్ పథకాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు.

50 స్టాళ్లను ఏర్పాటు చేసి భారీ సమాచార ప్రదర్శనను నిర్వహించనున్నామన్నారు. అంతేకాక పలు అంశాలపై సదస్సులు, సమావేశాలు, గోష్టులు నిర్వహించనున్నామని, వీటితో పాటు కళాబృందాల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రాంకిషన్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు